గజిబిజి.. గందరగోళం | Sakshi
Sakshi News home page

గజిబిజి.. గందరగోళం

Published Fri, Nov 9 2018 1:19 PM

grand alliance in high confusion - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సీట్ల పంపకాలు.. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్‌ సాచివేత ధోరణి మిత్రపక్షాలను డోలాయమానంలో పడేస్తోంది. నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్నా సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, టీజేఎస్‌ పార్టీల్లో సస్పెన్స్‌  నెలకొంది. సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతునప్పటికీ, ఏయే స్థానాలు కేటాయించారనేది తేలకపోవడంతో మహాకూటమిలో గందరగోళం నెలకొంది. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలను గురువారం కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రకటించినా.. ఇందులో మన జిల్లాలో ఆ పార్టీలకు ఇచ్చే సీట్లు ఏవీ అనేది ప్రకటించలేదు. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన నెలకొంది. దీనికితోడు భాగస్వామ్య పక్షాలకే కేటాయించేస్థానాలపైనా ఉత్కంఠ కొనసాగిస్తోంది. దీంతో మొత్తంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ గందరగోళంగా మారింది.

రోజుకో మాట.. 
గురువారం లోపు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని మొదట ప్రకటించిన కాంగ్రెస్‌.. తాజాగా మరో రెండు రోజుల గడువు తీసుకుంది. శనివారం నాడు తొలి జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆ  పార్టీ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపింది. ఇదిలావుండగా, కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాతోపాటు మహాకూటమి అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారనే ప్రచారంతో ఎవరెవరికి ఏ సీటు కేటాయిస్తారో తేలిపోతుందని అంతా భావించారు. కానీ, అభ్యర్థుల వడపోతలో కాంగ్రెస్‌ చేస్తున్న జాప్యం మిత్రపక్షాలను కలవరపరుస్తోంది. దీనికితోడు పొత్తులపై జరుగుతున్న రోజుకో ప్రచారం.. ఎవరి సీటుకు ఎసరు తెస్తుందోననే ఆందోళన కలుగుతోంది.

టీడీపీకి ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఇవ్వనున్నట్లు ఇరుపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీటిపై అధికారికంగా ప్రకటన చేస్తే తప్ప స్పష్టత రాదు. అయితే, ఆ లోపు ఈ సీటుపై కన్నేసిన కాంగ్రెస్‌ ఆశావహుల్లో టెన్షన్‌ పెరగడమేగాకుండా  సీటు దక్కకపోతే అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు. ఒకవేళ వీటిని టీడీపీకి కేటాయించాలని భావిస్తే ముందుగానే ఆశావహులను బుజ్జగించడం ద్వారా నష్టనివారణ చర్యలకు దిగే ఆస్కారముంది.

కానీ, ఇప్పటివరకు అభ్యర్థుల ఖరారు క్రతువు మొదలు పెట్టకపోవడం.. మిత్రపక్షాలకిచ్చే సీట్లను ప్రకటించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఇదిలావుండగా, రాజేంద్రనగర్‌ స్థానంపై కూడా అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే కుటుంబానికి ఒక టికెట్టు అంక్ష ఈ సీటును ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డికి ప్రతిబంధకంగా మారగా.. తాజాగా టీడీపీ జాబితాలో ఈ స్థానం కూడా ఉందని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. 

Advertisement
Advertisement