సన్నరకానికి పెరిగిన ధర

Grain Pouches Centers Prices Hikes Nizamabad - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): నిన్న మొన్నటి వరకు చిన్న బోయిన సన్న రకాల ధర క్ర మ క్రమంగా పెరుగుతుండటంతో రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి కోత లు ఆరంభమైన సమయంలో సన్న రకం వరి ధాన్యానికి తక్కువ ధర ఉండటంతో ముందుగా పంటను విక్రయించిన రైతులు నష్టాలను చవి చూశారు. అయితే వా రం రోజుల నుంచి సన్న రకం వరి ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడటంతో ధరకు రెక్కలు తొడిగాయి. బీపీటీ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1,650 నుంచి రూ.1,750 వరకు ధర పలుకుతోంది. అయితే సన్న రకాల్లో అత్యంత సన్నవిగా గుర్తింపు పొందిన జై శ్రీరాం, సూపర్‌ సీడ్, తెలంగాణ సోన రకాలకు మాత్రం క్వింటాలుకు రూ.2,100 నుంచి రూ.2,200 ధర పలుకుతోంది.

గతంలో క్వింటాలుకు రూ.2,100 ధర ఉండగా ఈ సారి రూ.100 ఎక్కువగా ధర పెరిగింది. ఖరీఫ్‌ సీజనుకు గాను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. ఇందులో అధిక భాగం సన్న రకాలను సాగు చేశారు. సన్న రకాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కొత్త రకాలను రైతులు సాగు చేయడం విశేషం. సన్న రకాలకు మార్కెట్‌ ఆరంభంలో క్వింటాలుకు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు మాత్రమే ధర పలికింది. సన్న రకం బియ్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నా వ్యాపారులు సిండికేట్‌ కావడంతో ధర ఎక్కువగా పలుకడం లేదని రైతులు వాపోయారు. ఈ సీజనులో సుమారు 60 శాతం సన్న రకాలనే రైతులు సాగు చేశారు.

కేవలం 40 శాతం మాత్రమే దొడ్డు రకం వరి ధాన్యం సాగు అయ్యింది. అయితే దొడ్డు రకానికి కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్‌ ధర లభించింది. ప్రభుత్వం ఏ గ్రేడ్‌ రకానికి రూ.1,750 మద్దతు ధరగా ప్రకటించింది. దొడ్డు రకాలను సాగు చేసిన రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. సన్న రకాలకు మాత్రం కొనుగోలు కేంద్రాల్లో బీ గ్రేడ్‌ రకం ధరను వర్తింప చేశారు. కొనుగోలు కేంద్రాల్లో బీ గ్రేడ్‌ రకానికి క్వింటాలుకు రూ.1,720 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది.

సన్న రకాలను కొనుగోలు కేంద్రాల్లో కాకుండా వ్యాపారులు, రైస్‌ మిల్లర్లకు విక్రయించడం వల్ల ఎక్కువ ధర పొందవచ్చని రైతులు భావించారు.  వ్యాపారులు మొదట్లో ఎక్కువ ధర చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారు.  ఎగుమతులకు డిమాండ్‌ పెరగడంతో సన్న రకాల ధర గతంలో కంటే ఎక్కువ పెరిగింది. రోజు రోజుకు సన్న రకాల ధర పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమ వద్ద ధాన్యం నిలువలు తగ్గిపోయే వరకు ఇదే ధర కొనసాగితేనే ప్రయోజనం అని రైతులు పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top