బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయ సునామీనే..

Government Should Not Decrease BC Reservation Says By Jajula Srinivas - Sakshi

సాక్షి, ఖమ్మం:  బీసీలకు రిజర్వేషన్‌ తగ్గిస్తే రాజకీయ సునామీ సృష్టిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ తగ్గింపును నిరసిస్తూ బీసీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేకల సుగుణారావు అధ్యక్షతన ఆదివారం ఖమ్మం బైపాస్‌రోడ్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు, మహారాష్ట్రలో, ఏపీలో 60 శాతం పైగా రిజర్వేషన్‌ అమలు చేస్తుంటే, అక్కడ లేని నిబంధన తెలంగాణలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీసీలపై తీవ్రమైన రాజకీయ వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. 34 శాతం ఇస్తున్న రిజర్వేషన్లు సరపోవని, వాటిని 52శాతం పెంచాలని తాము డిమాండ్‌ చేస్తుంటే 22 శాతం తగ్గించడం ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయంతో 18 జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ సభ్యుడు కూడా బీసీలు లేరని అన్నారు. 1980 సర్పంచ్‌ పదవులు సైతం కోల్పోయామన్నారు. 32 జెడ్పీ చైర్మన్‌ సీట్లలో బీసీలకు ఆరు మాత్రమే వచ్చాయని తెలిపారు.  మహబూబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో ఒక్క ఎంపీపీ కూడా బీసీలకు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది బీసీలు ఉండాల్సి ఉండగా, 22 మంది మంది మాత్రమే కొనసాగుతున్నారని వివరించారు. ఇది బీసీలను రాజకీయంగా సమాధి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారం సాధించుకునే దిశగా బీసీలు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్‌ తగ్గించడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు  మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్‌ తగ్గించడం వలన అత్యధికంగా నష్టపోయింది ఖమ్మం జిల్లా బీసీలేనన్నారు. 583 సర్పంచ్‌ పదవులు జిల్లాలో ఉంటే  240 మంది బీసీ సర్పంచ్‌లు ఎన్నిక కావాల్సింది, కేవలం 58 మంది మాత్రమే ఎన్నికయ్యారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నట్లు తమ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు.

సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, బీజేపీ  బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్ల వెంకటనర్సయ్య, టీజేఎస్‌ నాయకులు సోమయ్య, బీసీటీయూ రాష్ట్ర అధక్షుడు సుంకర శ్రీనివాస్, పంచవృత్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వినయ్‌కుమార్, వెంకటరమణ, విజయకుమార్, గాంధి, మామిడి వెంకటేశ్వర్లు, సోమన్నగౌడ్, రజకసంఘం నాయకులు సీతారామయ్య, లిక్కి కృష్ణారావు, శెట్టిరంగారావు, యాకలక్ష్మి, డాక్టర్‌ కేవీ.కృష్ణారావు, పాల్వంచ రామారావు, రామ్మూర్తి, శ్రీనివాస్, బచ్చల పద్మాచారి, ఆవుల అశోక్‌  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top