విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వాలదే

The government is responsible for education and medicine - Sakshi

లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ 

సాక్షి, సుందరయ్యవిజ్ఞానకేంద్రం: విద్య, వైద్యం బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ అన్నారు. రాష్ట్రంలో వైద్య రంగంలో నైపుణ్యానికి తగిన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలంగాణ కమిటీ, జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త  ఆధ్వర్యంలో శనివారం సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేపీ మాట్లాడుతూ.. బ్రిటన్‌లో అమలు చేస్తున్న నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

ప్రపంచంలోనే బ్రిటన్‌ తరహా వైద్య విధానం మొదటి వరుసలో నిలిచిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి స్థానిక వైద్య రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.  ప్రజా ఆరోగ్య కేంద్రంగా వైద్య ఆరోగ్య రక్షణకు ఒక నిర్ధిష్టమైన పాలసీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జీడీపీలో ఆరోగ్య రంగానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండాల్సిన వైద్య రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుందని అన్నారు.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు నిర్ణయాన్ని  వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బి.ప్రతాప్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సంజీవ్‌ సింగ్, వైద్యులు అర్జున్, అశోక్‌ రెడ్డి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top