
ఆరుగురు సలహాదారులు
తెలంగాణలో ప్రభుత్వపాలన సజావుగా సాగడానికి, కీలకమైన అంశాల్లో అపారమైన అనుభవం ఉన్న అధికారుల సహకారం తీసుకోవాలని నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం ఆరుగురు సలహాదారులను నియమించుకుంది.
తెలంగాణలో ప్రభుత్వపాలన సజావుగా సాగేందుకు
నలుగురు రిటైర్డ్ ఐఏఎస్‌లు
ఒకరు జలవనరుల నిపుణులు
మరొకరు ఆర్థిక నిపుణులు
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వపాలన సజావుగా సాగడానికి, కీలకమైన అంశాల్లో అపారమైన అనుభవం ఉన్న అధికారుల సహకారం తీసుకోవాలని నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం ఆరుగురు సలహాదారులను నియమించుకుంది. వీరిలో నలుగురు రిటైర్డ్ ఐఏఎస్‌లు కాగా, ఒకరు జలవనరుల నిపుణులు, మరొకరు ఆర్థికాంశాల్లో నిపుణులు. ఆర్. విద్యాసాగర్‌రావు(జలనవరులు), పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారులు ఏకే గోయల్, ఎ.రామలక్ష్మణ్, బీవీ పాపారావు, కేవీ రమణాచారి, ఇండియన్ ఎకనమిక్ సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన జీఆర్ రెడ్డిలను సర్కార్‌కు సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పదవీకాలం ఏడాదిపాటు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆర్. విద్యాసాగర్‌రావు : ఇంజనీరింగ్ నిపుణుడైన విద్యాసాగర్‌రావు గతంలో సాగునీటిపారుదల శాఖలో పనిచేశారు. అనంతరం ఆయన కేంద్ర జలవనరుల శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి జలవనరులపై కీలకమైన సలహాలు ఇస్తూ వస్తున్నారు.
ఏకే గోయల్: పదవీవిరమణ చేసిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ప్రణాళిక, ఇంధన శాఖల ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
ఎ.రామలక్ష్మణ్: పదవీవిరమణ చేసిన ఐఏఎస్ అధికారి రామలక్ష్మణ్ అనేక బాధ్యతలు నిర్వహించారు. సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తరువాత టీఆర్‌ఎస్‌లో చేరారు.
కేవీ రమణాచారి: తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా, సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేసి విశేష అనుభవం గడించిన రమణాచారి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కొంతకాలం సాంస్కృతిక శాఖ సలహాదారుగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయనను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ సలహాదారుగా నియమించింది.
జీఆర్ రెడ్డి: ప్రస్తుతం ఆర్థిక శాఖలో 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనను సలహాదారుగా నియమించారు. ఆర్థిక అంశాల్లో నిపుణుడైన జీఆర్ రెడ్డి ఆర్థిక శాఖలోనే పలు బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక అంశాలపై ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు.
బీవీ పాపారావు: మాజీ ఐఏఎస్ అధికారిగా విశేషానుభవం ఉన్న వ్యక్తి. పదవీ విరమణ అనంతరం టీఆర్‌ఎస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు.