‘బీ–ట్రాక్‌’@ గ్రేటర్‌

GHMC Team Vist Karnataka For Traffic Signals Awareness - Sakshi

బెంగళూరు తరహాలో ఏర్పాటు

ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై అధ్యయనం

2006 లోనే అక్కడ రూ.350 కోట్లతో శ్రీకారం

ఏటా తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు

సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నిర్వహణపై అధ్యయనానికి పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ నేతృత్వంలో జరిగిన ‘నగర ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌’ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అయితే కేవలం ఒక్క ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నిర్వహణ మాత్రమే కాకుండా, అక్కడి ట్రాఫిక్‌ పోలీసులకు వరంగా మారిన ‘బీ–ట్రాక్‌’ను సిటీలో అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రహదారులపై ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే, రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధులు ట్రాఫిక్‌ పోలీసులవైతే... అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులది. వీరిద్దరి మధ్యా సమన్వయ లోపం బెంగళూరులోనూ వాహనచోదకులను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. దీనికి పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం అమలులోకి తెచ్చిందే ‘బీ–ట్రాక్‌’ పథకం. 2006–07ల్లో ఐదేళ్ల కాలానికంటూ అమలులోకి వచ్చిన ఇది ఆ తర్వాత కొనసాగుతోంది. బీ–ట్రాక్‌గా పిలిచే ‘బెంగ ళూరు ట్రాఫిక్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌’ అక్కడ మంచి ఫలితాలను సాధిస్తూ రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. 

నగరంతో ఎన్నో సారూప్యతలు...
 బెంగళూరుతో హైదరాబాద్‌కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. హైదరాబాద్‌ తరహాలోనే అది కూడా ఎంతో పాత నగరం. దీంతో అనేక రహదారులు చిన్నవిగా, బాటిల్‌నెక్స్‌తో నిండి ఉంటాయి. వినియోగంలో ఉన్న వాహనాల్లో అత్యధిక శాతం ద్విచక్ర వాహనాలే. పీక్‌ అవర్స్‌లో రోడ్లపై అడుగుపెట్టాలంటే నగరకమే. వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థాయిలో పార్కింగ్‌ వసతులు ఉండవు. ఇక్కడి మాదిరిగానే సాఫ్ట్‌వేర్‌ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ కారణాల నేప థ్యంలో అక్కడి ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్‌ నరకాన్ని చవిచూడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు, వాటిలో క్షతగాత్రులు, మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. కొన్ని చిన్న చిన్న మౌలికవసతుల కోసం ఇక్కడి ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీపై ఆధారపడినట్లే అక్కడి అధికారులు బీఎంసీ అనుమతికోసం ఎదురు చూడాల్సి వచ్చేది.

‘బీ–ట్రాక్‌’తో మారిన పరిస్థితులు...
ఈ నేపథ్యంలో బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ఎదుర్కొంటున్న  సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం బీ–ట్రాక్‌ పథకాన్ని అమలులోకి తెచ్చింది. సాధారణ మౌలికవసతుల ఏర్పాటు, ట్రాఫిక్‌ నిబంధనల ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యను సాధ్యమైనంత వరకు తగ్గించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఇందుకుగాను 2006–07లో రూ.350 కోట్లు కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం నాలుగేళ్లలో ఈ నిధులను వినియోగించుకోవా లని నిబంధన పెట్టింది. అయితే అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు చేసిన విన్నపాల్ని పరిగణలోకి తీసు కున్న ప్రభుత్వం కాలపరిమితిని ఎత్తివేసింది. ఏటా ట్రాఫిక్‌ పోలీసులు సమర్పించే యాక్షన్‌ ప్లాన్‌ ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది. 2019 –20కి గాను రూ.139 కోట్లు కేటాయించింది.

పరిజ్ఞానం, మౌలికవసతులకు వినియోగం...
బీ–ట్రాక్‌ నిధులను బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు మౌలికవసతుల అభివృద్ధికీ వినియోగిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కోసం 379 ప్రాంతాల్లో సర్వైలెన్స్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చే ఫీడ్‌ను అధ్యయనం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాంతాల వారీగా ఏరియా ట్రాఫిక్‌ సెంటర్లతో పాటు ఇన్‌ఫాంట్రీ రోడ్‌లోని ట్రాఫిక్‌ హెడ్‌–క్వార్టర్స్‌లో భారీ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ (టీఎంసీ) ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఉల్లంఘనులకు కౌన్సిలింగ్‌  కోసం అత్యాధునిక వసతులతో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు.

 గణాంకాలివీ...
నగర పరిధి :  369 చదరపు కిమీ
వాహనాల సంఖ్య : 43,85,343
ద్విచక్ర వాహనాలు : 69.09 శాతం
 పెరుగుదల రేటు : 4 శాతం
ట్రాఫిక్‌ పోలీసుల సంఖ్య:     2800

బీ–ట్రాక్‌ ద్వారా సమకూరినవి
379 సర్వైలెన్స్, 15 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కెమెరా లు, 29 ఇంటర్‌సెప్ట్‌ వాహనాలు
నగరంలోని 428 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు/ఉన్నవి అప్‌–గ్రేడ్‌ చేయడం.
625 ప్రాంతాల్లో వార్నింగ్‌ సిగ్నల్స్, 56 చోట్ల పాదచారుల కోసం పెలికాన్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు.
క్షేత్రస్థాయిలో ఉల్లంఘనల్ని నమోదు చేయడానికి ప్రింటర్‌తో కనెక్టివిటీ ఉన్న 650 బ్లాక్‌బెర్రీ ఫోన్లు.
కీలక, అవసరమైన ప్రాంతాల్లో 30 వేల రోడ్‌ సైనేజస్, వెయ్యి ట్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డుల ఏర్పాటు.  
85 జంక్షన్లను సమకాలీన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చేయడంతో పాటు రెండు లక్షల చదరపు మీటర్ల రోడ్‌ మార్కింగ్స్‌.
బ్రీత్‌ అనలైజర్ల సమీకరణ.
భారీగా అవగాహన కార్యక్రమాల నిర్వహణ ద్వారా వాణిజ్య సముదాయాలు చిన్న వర్టికల్‌ పార్కింగ్‌ ఏర్పాటుకు ప్రోత్సహించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top