నిబంధనలు పాటించని పబ్‌ల సీజ్‌

GHMC Seized Pubs And Restaurants without Conditions Running - Sakshi

బంజారాహిల్స్‌:  సరైన అనుమతులు తీసుకోకుండా,  ప్రజా రక్షణ లేకుండా నిర్వహిస్తున్న పలు పబ్‌లు, రెస్టారెంట్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్‌లోని పలు పబ్బులు, రెస్టారెంట్లను తనిఖీ చేసిన జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫారుఖి వాటిని సీజ్‌ చేశారు. గతంలోనే ఈ పబ్‌ల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకుండా యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. పార్కింగ్‌ సదుపాయం లేకుండా, తాత్కాలిక నిర్మాణాల్లో కొనసాగిస్తున్న పబ్‌లు, ఫైర్‌ ఎన్‌వోసీ, ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా నిర్వహిస్తున్న పబ్‌లను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 45 పబ్‌లు ఉండగా అందులో 12 మాత్రమే నిబంధనలకు లోబడి పని చేస్తున్నాయని ఆయన అన్నారు. మిగతావాటికి నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని జీరో 40 బ్రీవింగ్, ఫర్జీ కేఫ్, లీ వింటేజ్, కార్పేడియం నైట్‌ క్లబ్, ది పెవీలియన్, బ్రాడ్‌వే, అబ్సార్బ్‌ బొటిక్‌ బార్, జెన్‌ ఆన్‌ 10, జూరి కేఫ్‌ అండ్‌ బార్, టీవోటీ పబ్‌ అండ్‌ రెస్టారెంట్లను సీజ్‌ చేశారు. ఈ దాడుల్లో టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ కృష్ణకుమారి, ఏఎంహెచ్‌వో డాక్టర్‌ రవికాంత్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top