అప్పుతోనూ ‘గొప్ప పనే’

GHMC Great Work in Lockdown Time Hyderabad - Sakshi

అభివృద్ధి పనులకు కలిసివచ్చిన కాలం

లాక్‌డౌన్‌లో చకచకా సాగుతున్న నిర్మాణాలు

ఆదాయం లేకున్నా అలా ముందుకు..

జీహెచ్‌ఎంసీలో రూ.750 కోట్ల పనులు

గత ఏడాది ఇదే సమయానికి రూ.59 కోట్లే

సాక్షి, సిటీబ్యూరో: కరోనా.. కోవిడ్‌– 19 పేరేదైనా అందరినీ హడలెత్తిస్తోంది. ఆదాయం లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహా అన్నింటి పరిస్థితీ ఇదే. కానీ.. జీహెచ్‌ఎంసీలో మాత్రం ఆదాయం లేకున్నా పనులు ఆగడం లేదు. ముందుకు సాగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకపోవడంతో రహదారుల నిర్వహణ, రీకార్పెటింగ్‌ వంటి పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్ల వంటి భారీ ప్రాజెక్టుల పనులు ఆగకుండా ముందుకు సాగేందుకు బ్యాంకుద్వారా తీసుకున్న అప్పు ఉపయోగపడుతోంది. జీహెచ్‌ఎంసీలో ఎస్సార్డీపీ కింద పనులకు మొత్తం రూ.3500 కోట్లు అప్పు, బాండ్ల రూపేణా సేకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ఇందులో రూ. 2500 కోట్ల  నిధుల రుణానికి బ్యాంకుతో ఒప్పందం కుదిరింది. పనుల పురోగతిని బట్టి ఎప్పటికప్పుడు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. అలా ఎస్సార్‌డీపీలో భాగంగా చేపట్టిన పనులకు నిధుల కొరత లేకపోవడంతో ఆ పనులు ఆగకుండా సాగుతున్నాయి. దాంతో ఎల్‌బీనగర్‌ దగ్గర అండర్‌పాస్, బయో డైవర్సిటీ మొదటి వరుస ఫ్లై ఓవర్‌లు  ఈ నెలాఖరు వరకు పూర్తికానున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, కామినేని వద్ద రెండో ఫ్లై ఓవర్‌ మరో రెండునెలల్లో పూర్తి కానున్నాయి. లాక్‌డౌన్‌ వచ్చినా, జీహెచ్‌ఎంసీకి ఆదాయం తగ్గినా, పనుల చెల్లింపులకు నిధులందడమే ఇందుకు కారణం. రుణం కోసం కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు గొప్పగా ఉపయోగపడుతోంది. మున్ముందు పరిస్థితులెలా ఉన్నా లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకునేందుకు మాత్రం ఇది ఉపకరించింది.

గ్రేటర్‌ ‘రికార్డు’ఖర్చు  
బల్దియా చరిత్రలోనే ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే  దాదాపు 40 రోజుల్లో రూ.750 కోట్ల  చెల్లింపులు జరిగిన సందర్భాల్లేవు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయం వరకు ఎస్టాబ్లిష్‌మెంట్, ఇతరత్రా ఖర్చులతో కలుపుకొని దాదాపు రూ. 59 కోట్లు  చెల్లించగా,   ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.750 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ పనుల్లో లాక్‌డౌన్‌ కంటే ముందువి కూడా ఉన్నప్పటికీ, చెల్లింపులు ఈ స్థాయిలో జరిగాయంటే.. పనులు ఆగకుండా కొనసాగించేందుకే. లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకే. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌లు లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆదేశించడం తెలిసిందే. 

వలస కార్మికులు వెళ్లకుంటే మరింత స్పీడ్‌గా..
ఆయా ప్రాజెక్టుల్లో పనులు చేస్తున్న  ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు చాలామంది తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇంకా వెళ్లిపోతున్నారు. వారంతా ఇక్కడే ఉండి ఉంటే ఈ పనులింగా వేగంగా జరిగేవని అధికారులు చెబుతున్నారు.

‘అన్నపూర్ణ’కు ప్రాధాన్యం
లాక్‌డౌన్‌లో ఎవరూ ఆకలితో అలమటించరాదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అన్నపూర్ణ పథకం ద్వారా ఉచిత భోజన కార్యక్రమాల్ని విస్త్రుతం చేశారు. గతంలో ఈ భోజనానికి లబ్ధిదారుల నుంచి  నామమాత్రంగా రూ. 5లు వసూలు చేసేవారు. ప్రస్తుతం పూర్తి ఉచితంగా  అందజేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయం వరకు  ఈ పథకం కోసం జీహెచ్‌ఎంసీ ఖజానానుంచి చెల్లింపులేమీ జరగకపోగా  ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు  రూ. 1.65 కోట్లు  చెల్లించినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top