శరవేగం!

GHMC Focus on Pending Project Works in Lockdown Time - Sakshi

గత ఆర్థిక సంవత్సరం రూ.450 కోట్ల ప్రాజెక్టులు పూర్తి

ఈ ఏడాది రెట్టింపు పనులయ్యే అవకాశం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చురుగ్గా కొనసాగుతున్న పనులు  

జీహెచ్‌ఎంసీకి కలిసివచ్చిన నిర్మాణాల కాలం

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో వివిధ ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం (2019– 20)తో పాటు ప్రస్తుతకొత్త ఆర్థిక సంవత్సరం (2020–21)లోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వేగంగా జరుగుతున్నాయి. నగరంలో ఏ ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నా, ట్రాఫిక్‌ మళ్లించాల్సి ఉండటం, రాత్రివేళల్లో మాత్రమే పనులు జరగడం వంటి కారణాలతో ఆలస్యమయ్యేది. వీటికి తోడు భూసేకరణ సమస్యలతోనూ చాలాకాలంపెండింగ్‌లో ఉండేవి. జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఎన్నికలు వచ్చే కొత్త సంవత్సరం ఆరంభంలోజరగాల్సి ఉన్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ పనులు చేయాలని భావించిన ప్రభుత్వం గత సంవత్సరం నుంచే పనుల వేగాన్ని పెంచాల్సిందిగా అధికారులను ఆదేశించింది. అలాగే మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ త్వరగా ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. మంత్రి హెచ్చరికల నేపథ్యంలో గత ఏడెనిమిది నెలలుగా పనులు ఊపందుకున్నాయి.

ముఖ్యంగా ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన పనులకు నిధుల కొరత కూడాలేకపోవడంతో పనుల వేగం పెరిగింది. భూసేకరణ సమస్యలున్న, ట్రాఫిక్‌ అనుమతి లభించని ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల వీలైనంత వేగంగా పనులు చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందుల వల్లే చాలాచోట్ల పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అందరికీ ఇబ్బందిగా మారిన లాక్‌డౌన్‌ జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు పనులకు మాత్రం తగిన సదుపాయాన్నిసమకూర్చింది. ఇదే అదనుగా పనుల వేగం పెంచారు. ఐదారు నెలల్లో జరిగే పనుల్ని నెలలోనే పూర్తిచేశారు. ఏడాది కాలంగా కాని పనుల్ని సైతం నాలుగు వారాల్లో చేయగలిగారు. గత సంవత్సరం నుంచే పనుల వేగం పెరగడంతో ప్రాజెక్టŠస్‌ విభాగం దాదాపు రూ.450 కోట్ల విలువైన పనుల్ని గత ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేసింది. గత మార్చిలో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో అప్పట్నుంచీ పెరిగిన వేగాన్ని కొనసాగిస్తోంది.లాక్‌డౌన్‌ లోపునే క్లిష్టమైన పనులన్నీ పూర్తిచేసేలక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే సమయం కలిసి రావడంతో ఎక్కువ పనులు చేశారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం గతసంవత్సరం కంటే రెట్టింపు పనులు జరిగేందుకు అవకాశం ఏర్పడింది. 

వాననీటి సమస్య పరిష్కారానికి రూ. 95 కోట్ల పనులు..
రోడ్ల వెంబడి నీరు పారే సాధారణ వరద కాలువల పనుల్ని మెయింటెనెన్స్‌ విభాగం నిర్వహిస్తుండగా, భారీ నాలాలు, వాటి ఆధునికీకరణ తదితర పనుల్ని ప్రాజెక్టŠస్‌ విభాగం నిర్వహిస్తోంది. వాననీటి ముంపు సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల్లో నాలాలను ఆధునికీకరించారు. రిటైనింగ్‌ వాల్స్‌ వంటి పనులు చేశారు. బాటిల్‌ నెక్స్‌ సమస్యలు పరిష్కరించారు. కల్వర్టు స్లాబుల నిర్మాణం వంటివి చేశారు. ఇలా 26 పనులు పూర్తి చేశారు. కైత్తాపూర్, హైటెక్‌ సిటీ, సున్నం చెరువు, ఆలుగడ్డ బావి జంక్షన్, పంజగుట్ట, బైరామల్‌గూడ, బండ్లగూడ, బర్లకుంట, ఖాజాగూడ, పాతబస్తీ, ఎల్‌బీనగర్‌ వివేకానందనగర్‌ తదితర ప్రాంతాల్లో  పనులు చేశారు. వీటి వ్యయం దాదాపు రూ.95 కోట్లు.

రోడ్ల కోసం రూ. 25.50 కోట్లు  
ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో లింక్‌ రోడ్లు, అప్రోచ్‌ మార్గాలు తదితర పనుల్ని ప్రాజెక్టŠస్‌ విభాగమే చేసింది. వీటిలో ముఖ్యమైనవి ఇనార్బిట్‌ మాల్‌– మాదాపూర్‌ మెయిన్‌రోడ్‌ వయా వెస్టి హోటల్, కొండాపూర్‌ మెయిన్‌రోడ్‌– జేవీ హిల్స్‌ వయా రాఘవేంద్ర కాలనీ, బొటానికల్‌ గార్డెన్‌– ఓల్డ్‌ బాంబే రోడ్డు బ్యాలెన్స్‌ పనులు. మియాపూర్‌– ఎల్లమ్మబండ లింక్‌రోడ్డు, బేగంపేట రైల్వే స్టేషన్‌ దగ్గర బ్రిడ్జి ఓవర్‌ నాలా వెడల్పు, అప్రోచ్‌రోడ్డు తదితర పనులు ఉన్నాయి. 

మరికొన్ని ఇలా..
వీటితోపాటు 5 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబీ), 6 ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు, 14 ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, వివిధ ప్రాంతాల్లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, స్టేడియాలకు సంబంధించిన పనులు చేశారు. వీటికైన ఖర్చు దాదాపు రూ.60కోట్లు. ఇవి కాకుండా కార్యాలయ భవనాలు, ఇతరత్రా పనులతో కలిపి మొత్తం దాదాపు రూ.450 కోట్లు పనులు చేశారు. రోడ్ల నిర్వహణ, రీకార్పెటింగ్‌ పనుల వంటివి నిర్వహణ విభాగం పర్యవేక్షిస్తుంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ప్రత్యేక విభాగం ఉంది. ఆ పనులు వీటికి అదనం.

త్వరలోనే పూర్తయ్యేవి..
బయో డైవర్సిటీ మొదటి వరుస ఫ్లై ఓవర్‌తోపాటు దుర్గంచెరువు కేబుల్‌ స్ట్రేబిడ్జి పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. కామినేని జంక్షన్‌ వద్ద కుడివైపు ఫ్లై ఓవర్, ఎల్‌బీనగర్‌ అండర్‌పాస్,  జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి తదితర పనులు కూడా త్వరలో పూర్తి కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top