ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ మారని రూపురేఖలు

Ghanpur Project Not Developed In Medak District - Sakshi

గతంలో సుమారు రూ.90 కోట్లు.. ఇటీవల రూ.34 కోట్ల కేటాయింపు

ఏళ్లతరబడి కొనసా..గుతున్న పనులు

మెతుకుసీమ జీవన వాహిని.. జిల్లాలో ఉన్న ఏకైక మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్ట్‌  ఘనపూర్‌. ఎన్నో ఏళ్లుగా జిల్లాలోని సుమారు 21,625 ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ.. రైతుల కల్పతరువుగా మారిన ఈ ఆనకట్ట కీర్తి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చుక్క నీరు లేని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆనకట్ట ఎత్తు పనులు భూసేకరణలో అవరోధాలతో నిలిచిపోయాయి. దీని పరిధిలోని రెండు కాల్వలకు సంబంధించి సిమెంట్‌ లైనింగ్‌ పనులు 2005లో మొదలు కాగా.. ఇప్పటివరకు పూర్తి కాలేదు. 

సాక్షి, మెదక్‌: జిల్లా రైతాంగానికి పెద్దదిక్కుగా నిలుస్తోన్న ఘనపురం ప్రాజెక్ట్‌ అభివృద్ధి పనులు ఏళ్లకేళ్లుగా కొనసా.. గుతూనే ఉన్నాయి. ప్రస్తు తం చుక్క నీరు లేని పరిస్థితుల్లో మంజీర పరవళ్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. సుమారు 14 సంవత్సరాలుగా ఆయకట్టు రైతులను వెక్కిరిస్తూనే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై దృష్టిసారించింది. నిధులు సైతం కేటాయించినప్పటికీ.. ఆశించినంత అభివృద్ధి జరగడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు
మంజీరా నదిపై కొల్చారం–పాపన్నపేట మం డలాల మధ్య ఏడుపాయల ప్రాంతంలో 1905 లో ఘనపూర్‌ మధ్య తరహా ప్రాజెక్టును నిర్మించారు. ఆనకట్ట పొడవు 2,337 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు. దీని పరిధిలో రెండు కాల్వలు (మహబూబ్‌నహర్, ఫతేనహర్‌) ఉండగా.. ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు. మహబూబ్‌నహర్‌ (ఎంఎన్‌) కెనాల్‌ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా.. దీని ద్వారా కొల్చారం, మెదక్, హవేళిఘనపూర్‌ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఫతేనహర్‌ (ఎఫ్‌ఎన్‌) కెనాల్‌ పొడవు 12.80 కి.మీ కాగా.. పాపన్నపేట మండలంలోని 11 గ్రామా ల్లో 10,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది.

‘తెలంగాణ’లో నిధుల వరద
ఘనపూర్‌ కాల్వల ఆధునికీకరణ కోసం 2005లో అప్పటి ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జైకా పథకం కింద రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు వినియోగించకపోవడంతో వెనక్కిమళ్లాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్ట్‌ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వయంగా 2014 డిసెంబర్‌ 17న ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ బాట పట్టారు. సందర్శించిన సమయంలోనే ప్రాజెక్ట్‌ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మెదక్, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి కృషి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో వెనక్కి మళ్లిన జైకా నిధులు తిరిగివచ్చాయి. సీఎం హామీ మేరకు ఓసారి రూ.21.64 కోట్లు, ఆ తర్వాత రూ.43.64 కోట్లతోపాటు మరో రూ.1.64 కోట్లు మంజూరయ్యాయి. కాల్వల ఆధునికీకరణ, గేట్ల మరమ్మతులు, ఆనకట్ట ఎత్తు పెంపు, భూసేకరణకు ఈ నిధులు మంజూరయ్యాయి. తాజాగా ఇటీవల బడ్జెట్‌లో ఘనపూర్‌ ప్రాజెక్ట్‌కు రూ.34 కోట్లు కేటాయించారు.

సా..గుతున్న పనులు
మహబూబ్‌నహర్, ఫతేనహర్‌ కెనాల్‌ ఆధునికీకరణలో భాగంగా సిమెంట్‌ లైనింగ్‌ పనులు చివరి వరకు కాలేదు. ఫతేనహర్‌ కెనాల్‌ పొడవు 12.80 కిలో మీటర్లు కాగా.. దౌలాపూర్‌ వరకు.. మహబూబ్‌నహర్‌ కాల్వ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా మత్తాయిపల్లి వరకు (32 కి.మీలు) మాత్రమే సిమెంట్‌ లైనింగ్‌ పనులు పూర్తయ్యాయి. మహబూబ్‌నహర్‌ కెనాల్‌ కింద శాలిపేట నుంచి జక్కన్నపేట వరకు.. ఫతేనహర్‌ కెనాల్‌ కింద 11 కి.మీల మేర పాపన్నపేట వరకు బ్రాంచ్‌ కాల్వ పనులు, గైడ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. ఫతేనహర్‌ కెనాల్‌ కింద గాంధారిపల్లి, జయపురం, లక్ష్మీనగర్, అబలపూర్, అన్నారం, యూసుఫ్‌పేట్, కుర్తివాడ, మిన్పూర్, పాపన్నపేట, నాగ్సానిపల్లి, పొడిచంపల్లిలో సీసీ లైనింగ్‌ పనులు పూర్తి కాలేదు. ఇలా ఏళ్లకేళ్లుగా పనులు కొనసాగుతుండగా.. మొదట చేసినవి శిథిలావస్థకు చేరాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది.

భూసేకరణలో అవరోధాలు
ఆనకట్ట ఎత్తు పెంపునకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పలు ప్రాంతాల్లో భూసేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. గత బడ్జెట్‌లో మంజూరైన వాటిలో సుమారు రూ.13 కోట్లు భూసేకరణకు కేటాయించగా.. అవి అలానే ఉన్నట్లు సమచారం. మొత్తం 290 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటివరకు 230 ఎకరాలను క్లియర్‌ చేసినట్లు అధికారిక సమాచారం. 60 ఎకరాలకు సంబంధించి ఆర్డీఓ తదితరులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిన్న ఘనపూర్, సంగాయిపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇచ్చేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ బడ్జెట్‌లో భూసేకరణకు నిధులు కేటాయించడంతో ఈ సమస్య పరిష్కారమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు.

చుక్క నీరు లేదు.. 
ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్ట్‌లో చుక్క నీరు లేదు. మంజీర నది ప్రవాహం లేకపోవడం.. సింగూరు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ ఉంచకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. గత ఏడాది సింగూరు నుంచి 15 టీఎంసీల నీళ్లను ఎస్సారెస్పీ కెనాల్‌ ద్వారా నిజామాబాద్‌ జిల్లా అవసరాలకు తరలించడంతో ప్రస్తుతం ఎకరా కూడా సాగు చేయని దుస్థితి నెలకొందని స్థానిక రైతులు వాపోతున్నారు. ఆ నీళ్లు ఉంటే కనీసం ఒక్క పంటయినా వెళ్లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు.

భూసేకరణ కొనసాగుతోంది..
ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ సామర్థ్యం 0.2 టీఎంసీలు. పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 0.135కి తగ్గింది. మిషన్‌ కాకతీయలో పలు చోట్ల పూడిక తీశాం. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలకు చేరుకుంటుంది. మరో సుమారు ఆరు వేల ఎకరాల వరకు నీరందుతుంది. ఒక్కసారి నిండితే ఆయకట్టు రైతులు సులువుగా రెండు పంటలు తీయొచ్చు. ప్రభుత్వం తాజాగా బడ్జెట్‌లో కేయించిన నిధులను భూసేకరణ, గేట్ల బిగింపు, ఇతర ఆధునికీకరణ పనులకు వినియోగిస్తాం. – ఏసయ్య, నీటి పారుదల శాఖ ఈఈ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top