మాటలతోనే మభ్యపెడుతున్నారు..

G Kishan Reddy Slams On TRS Government  In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : పాలమూరు ప్రజలు కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం మాటలతో వారి కడుపు నింపుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన వివిధ రంగాల ప్రముఖుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పక్కనే కృష్ణానది పారుతున్నా.. వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు. ఇక్కడి ప్రజలు పనులు లేక వలసలు వెళుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చింతమడకపై ఉన్న ప్రేమ పాలమూరుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. గతంలో తాను శాసనసభ్యుడుగా ఉన్న సమయంలో పాలమూరు నుంచి పోరు యాత్ర ప్రారంభించడం జరిగిందని, ఇక్కడి ప్రజల కష్టాలు తనకు తెలుసన్నారు.

ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నీతివంతమైన అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని, పేద వర్గాలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చిందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందని, యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఉండొద్దని కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ్యులను చేర్చుకోవాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. పాలమూరు నుంచి మొట్ట మొదటి సారిగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 

నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ : పి.చంద్రశేఖర్‌
దేశంలో సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటుంటే రాష్ట్రంలో మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందుకు భిన్నంగా నిరంకుశ పాలన సాగిస్తుందని మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్‌ ఆరోపించారు. ట్రిబుల్‌ తలాక్‌ బిల్లుతో ముస్లిం మహిళలకు భద్రత, స్వేచ్ఛ వచ్చిందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాత్రం గ్రామాల్లో చెట్టు చనిపోతే సర్పంచి పదవికి తలాక్‌ చెబుతున్నారని విమర్శించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రేమతో పాలన అందించాల్సిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం తీసుకున్న మోదీ, అమిత్‌షాల వంటి సమర్థవంతమైన నాయకులు దేశానికి అవసరమన్నారు. 

కోర్టు ఆదేశాల మేరకే ట్రిపుల్‌ తలాక్, ఆర్టికల్‌ 370 రద్దు 
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ట్రిపుల్‌ తలాక్, ఆర్టికల్‌ 370 రద్దు చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్ల ఎన్‌డీఏ పాలనలో మిగులు విద్యుత్‌ దేశంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. దేశంలోని 18 వేల గ్రామాల్లో విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి వెలుగులు నింపామని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించిన ఘనత తమదేనన్నారు. తెలంగాణలో ఈబీసీ రిజర్వేషన్‌ అమలు చేయకుండా సీఎం కేసీఆర్‌ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, ఆస్పత్రులకు బాకీలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.    

మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top