పేద మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు

Free Gas Connections For SC ST Woman - Sakshi

 20న అవగాహన కార్యక్రమాలు

ఐవోసీ వరంగల్‌ రీజియన్‌ సేల్స్‌ ఆఫీసర్‌గోకుల్‌కృష్ణన్‌

కరీంనగర్‌సిటీ: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉపకరించే ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన‘ ఉచిత గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ గురించి వివరించేందుకు ఈనెల 20న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ పథకం కరీంనగర్‌ జిల్లా నోడల్‌ అధికారి గోకుల్‌కృష్ణన్‌ తెలిపారు. సోమవారం కరీంనగర్‌ ప్రెస్‌ భవన్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకం ప్రారంభంలో సామాజిక వెనుకబడిన తరగతుల వయోజన మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేవారని.. మరిన్ని వర్గాలలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, అటవీ ప్రాంతంలో నివసించే వారికి, అంత్యోదయ అన్నయోజన ఉన్న మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. పంచాయత్‌ సమావేశంలో ఎల్‌పీజీ వాడకంలో జాగ్రత్తలు, భద్రత, పొదుపు అంశాలపై శిక్షణనిస్తామని పేర్కొన్నారు.

500 మంది మహిళలను ఆహ్వానించి అందులో 100 మందికి గ్యాస్‌ కనెక్షన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. రూ.1600 విలువైన సిలిండర్, రెగ్యులేటర్, పైపు, నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందిస్తుండగా, మొదటి నిండు సిలిండర్, స్టౌ కొనుగోలు స్థితిలో లేని మహిళలకు వడ్డీలేని రుణ రూపేనా∙అందిస్తామని తెలిపారు. లబ్ధిదారులు వాడే ఏడో సిలిండర్‌ రాయితీ నుంచి రుణాన్ని రాబడుతారని పేర్కొన్నారు.  పథకం సద్వినియోగానికి అందరూ తమవంతు కృషి చేయాలని కోరారు. ఐఓసీఎల్‌ ఇండేన్‌ గ్యాస్‌ రామగుండం విక్రయ అధికారి శాంతి స్వరూప్, గ్యాస్‌ డీలర్ల సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి పి.వి.మదన్‌మోహన్, జిల్లా గ్యాస్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాధకృష్ణ, కార్యదర్శి లక్ష్మారెడ్డి, టీఎల్‌పీజీ ఉపాధ్యక్షుడు హరిక్రిష్ణ,  డీలర్లు భాగ్యలత, దీన్‌దయాల్, గంగాధర్, శ్రీచరణ్, మాధవ్, తిరుపతి, జగన్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top