జిల్లాల్లో సీసీఎస్‌లపై నజర్‌

Focus on ccs in districts - Sakshi

అత్యాధునిక టెక్నాలజీ, సిబ్బంది పెంపుపై పోలీసు శాఖ దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: నేరాల నియంత్రణ, నేరస్థుల కదలికలపై నిఘాపెట్టడం, నేర రహస్యాల ఛేదనపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల వారీగా సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్ల (సీసీఎస్‌)ను అందుబాటులోకి తేవాలను కుంటోంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటుగా నేరస్థులపై నిఘా పెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.  

ప్రతీ జిల్లాకు క్లూస్‌టీం: ఉమ్మడి జిల్లాల్లో బలంగా ఉన్న సీసీఎస్‌లను నూతన జిల్లాల్లోనూ ఆధునీకరించేందుకు క్లూస్‌ టీంలను రంగంలోకి దించనున్నారు. ఏదైనా హత్య జరిగితే ఉమ్మడి జిల్లానుంచే నూతన జిల్లాలకు క్లూస్‌ టీం రావాల్సి ఉంటోంది. దీనివల్ల కేసులో దర్యాప్తు ఆలస్యమవడం, అనుకున్న సమయంలో నిందితులను పట్టుకోవడం సాధ్యపడటంలేదు. ఈ నేపథ్యంలో జిల్లాకో క్లూస్‌ టీం, మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్, సంబంధిత బృందాలను ఏర్పాటుచేస్తే దర్యాప్తు వేగవంతమవడంతో పాటు అప్పటికప్పుడు కేసులో పురోగతి చూపడం సాధ్యమవుతుంది. అదేవిధంగా నూతన జిల్లాల్లో ప్రతీ సీసీఎస్‌ ఆధ్వర్యంలో సైబర్‌ క్రైమ్‌ విభాగం ఏర్పాటు చేసేందుకు పోలీస్‌ శాఖ అడుగులు వేస్తోంది.

ఈమేరకు ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బందితో టెక్నికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న వారిని గుర్తించి వారికి సైబర్‌ టెక్నాలజీ, ఆ నేరాల నియంత్రణ, ట్రాకింగ్‌ తదితరాలపై శిక్షణ ఇస్తున్నారు. కీలకమైన కేసుల్లో కాల్‌డేటా అనాలసిస్, లొకేషన్‌ ట్రాకింగ్, ఫేస్‌ రికగ్నైజేషన్‌ టూల్స్‌ విస్తృత వినియోగం, టీఎస్‌ కాప్‌ యాప్‌ డేటా బేస్‌ వినియోగంపై పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల మారుమూల జిల్లాల్లో కేసుల దర్యాప్తును కూడా పూర్తిస్థాయి టెక్నాలజీతో చేయాలని పోలీస్‌ శాఖ ఈ చర్యలు చేపట్టింది. కొత్త జిల్లాల్లోని సీసీఎస్‌లకు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లతో పాటు ముగ్గురు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లను కేటాయించనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top