మత్స్యమాఫియా

Fish mafia in Alampur - Sakshi

వరుస దాడుల్లోనూ తప్పించుకుంటున్న వైనం

పోలీసులకు చిక్కుతున్నది మత్స్యకార్మికులు మాత్రమే

దళారీ వ్యవస్థను అడ్డుకోలేకపోతున్న యంత్రాంగం

జీవనోపాధి కోల్పోతున్న స్థానిక మత్స్యకారులు 

అలంపూర్‌ రూరల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న తుంగభద్ర, కృష్ణానదుల్లో మత్స్యసంపదను కొల్లగొడుతున్న అలవి వలలు స్థానిక మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మత్స్యసంపదను మధ్య దళారీలు తరలించకుండా మత్స్యశాఖ, పోలీస్‌ యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా అలంపూర్‌ గొందిమల్ల, కూడవెల్లి తదితర ప్రాంతాల్లో స్థానికేతరులు ధనార్జనే ధ్యేయంగా వైజాగ్, రాజమండ్రి, తమిళనాడు, ఏపీ వంటి ప్రాంతాల నుంచి అలవి వలలతో చేపలను వేటాడే నైపుణ్యం గల వారికి రోజువారి కూలీలు ఇస్తూ ప్రభుత్వం నిషేధించిన అలవి, పట్టు, నంజు, మ్యాట్‌ వంటి వలలతో చేపలను వేటాడుతూ మత్స్య సంపదను కొల్లగొడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 20 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి. 

లైసెన్స్‌లు.. సొసైటీలు 
కులవృత్తి అయినంత మాత్రనా లేదా గంగపుత్రులు అయినంత మాత్రాన చేపలు వేటాడే అధికారం లేదు. ఇందుకోసం సంబంధిత మత్స్యశాఖ దగ్గర పేరు నమోదు చేసుకుని లైసెన్సులు పొందాలి. లేదా మత్స్యశాఖ సొసైటీలో కనీసం సభ్యుడై ఉన్నా చేపలను వేటాడవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 20 వేల మంది మత్స్యకారులున్నారు. రాజోళి, అలంపూర్, క్యాతూరు ఇలా మిగతా చోట సొసైటీలు కూడా ఉన్నాయి.

ఒక్కో సొసైటీలో 400–600 మంది దాకా ఉన్నారు. అలంపూర్‌ నియోజకవర్గంలో అయిజ నుంచి అలంపూర్‌ దాక 13 సొసైటీలు ఉండగా యాక్టివ్‌ ఉన్న సొసైటీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో 25 సొసైటీల్లో 38 సంఘాలు, 3,200 మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. ఇక వీరి ఆర్థిక పరిస్థితిలు గమనిస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. 

భద్రపరిచే పరికరాలేవీ..? 

రాష్ట్ర ప్రభుత్వం సహజసిద్ధ ఆర్థిక వనరులు పెంచే ప్రణాళికలో భాగంగా 2016–17 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు నాబార్డు నుంచి రాగా కేవలం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి చేపపిల్లను సరఫరా చేసింది. కానీ వీటిని భద్రపరిచేందుకు గాను టీవీఎస్‌ ఎక్సెల్‌ టాంటి మోపైడ్, బోట్లు, వల, ఐస్‌ బాక్స్‌ లాంటి పరికరాలు ఏవీ ఇవ్వలేదు. దీంతో పట్టిన చేపలను భద్రపరిచే పరిస్థితి లేకపవడంతో మత్స్యకారులు వాటిని మధ్యదళారీలకే అప్పగిస్తున్నారు.  

మధ్య దళారికే లాభాలు

ఉదయం నుంచి సాయంత్రం దాక కష్టపడిన మత్స్యకారుడికి కడుపు నిండటం గగనంగా మారింది. రోజంతా కష్టపడితే 100 కిలోల చేపలు పడుతాయి. ఇందులో చేప బరువును బట్టి మార్కెట్‌లో ధర నిర్ణయిస్తారు. అయితే మార్కెట్‌లో అమ్మకంపై మెళకువలు తెలియని అసలైన మత్స్యకార్మికుడు దళారీకి చేపలు విక్రయిస్తున్నాడు. దీంతో కష్టపడిన మత్స్యకార్మికుడుకి రోజుకు సగటున రూ.150–200 వస్తే గగనం.

ఇక అదే చేపలను కొనుగోలు చేసిన మధ్య దళారీ మాత్రం వాటిని హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున లాభాలు పొందున్నాడు. లైసెన్సులు పొంది పేరు రిజిష్ట్రేషన్‌ చేయించుకున్న వారికి మత్స్యశాఖ అధికారులు మార్కెటింగ్‌పై ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడం, వారికి అవగాహన లేకపోవడంతో మధ్య దళారీలే లాభపడుతున్నారు. 

త్వరలో  ఐఎఫ్‌డీఎస్‌ విధానం..

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఐఎఫ్‌డీఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ స్కీం) సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ విధానం ద్వారా మత్స్యకారులకు 75 శాతం రుణ సౌకర్యం కల్పిస్తారు. అదేవిధంగా రూ.310 చెల్లించిన లైసెన్స్‌దారులకు కావాల్సిన పరికరాలు 75 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం పంపారు. 

అమాయకులు బలవుతున్నారు..

అలవి వలల విషయంలో అమాయకులైన స్థానిక మత్స్యకారులే బలవుతున్నారు. వీరి వెనక ఉన్న అసలైన మాఫియా మాత్రం తప్పించుకుంటున్నారు. దీనికంతా కారణం మత్స్యకారులకు మత్స్యశాఖ తగిన రుణ సౌకర్యాలు కానీ మార్కెటింగ్‌ స్కిల్స్, అవైర్‌నెస్‌ ప్రోగ్రాం నిర్వహించకపోవడమే. 
– అశోక్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి,
ముదిరాజ్‌ మహాసభ 

కఠిన చర్యలు తప్పవు.. 

ప్రభుత్వం నిషేధించిన వలల ను ఉపయోగించడం కా కుండా ఎలాంటి అనుమతి, లై సెన్స్‌లు లేకుండా చేపలను వే టాడుతు మత్స్యసంపదను కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికంగా కొందరు మా ఫియా దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టు సమాచారం. తగిన ఆధారాలతో వారిని కూడా పట్టుకుంటాం. 
– ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ, అలంపూర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top