దివ్యాంగులకు ఊరట..

Facilities For Handicaps  - Sakshi

ఓటు హక్కు వినియోగించుకునేందుకు మెరుగైన సౌకర్యాలు

ఉచిత ప్రయాణం, పోలింగ్‌ కేంద్రం వద్ద ర్యాంపుల నిర్మాణం

జిల్లాలోని 15,665 మంది దివ్యాంగ ఓటర్లకు ఉపయోగం  

పాల్వంచ రూరల్‌/చుంచుపల్లి: గతంలో దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు, పోలింగ్‌ కేంద్రాల వద్దకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. దీంతో చాలామంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. దీన్ని గమనించిన ఎన్నికల సంఘం దివ్యాంగులు పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. దివ్యాంగులతోపాటు వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు  మెరుగైన సేవలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దివ్యాంగులను ముందుగానే గుర్తించి పోలింగ్‌ కేంద్రాలకు ఉచితంగా వాహనాల ద్వారా తరలించనున్నారు. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో కూడా ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. గతంలో ర్యాంపులు ఏర్పాటు చేసి ఉంటే మరమ్మతులు చేపడుతున్నారు. మూడు చక్రాల సైకిళ్లు అందుబాటులో ఉంచనున్నారు. దివ్యాంగులను నేరుగా పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంల వద్దకు పంపించనున్నారు.

 
జిల్లాలో 15665 మంది దివ్యాంగ ఓటర్లు
జిల్లా వ్యాప్తంగా 995 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 8,47,528 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19,274 మంది దివ్యాంగులు ఉన్నారు. వారిలో 15665 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇల్లెందు నియోజక వర్గంలో అత్యధికగా 3565 మంది దివ్యాంగ ఓటర్లు ఉండగా, అత్యల్పంగా 2952 మంది భద్రాచలం నియోజకవర్గంలో  ఉన్నారు.

వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం
దివ్యాంగుల కోసం వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్‌కు ముందురోజే  లైజన్‌ ఆఫీసర్, గ్రామదీపికలు దివ్యాంగుల ఇంటికి వెళ్లి సమాచారం ఇస్తారు. వారిని ఆటో ద్వారా తీసుకొచ్చి, ఓటేశాక అదే ఆటోలో ఇంటికి చేర్చుతాం. గర్భిణులు, బాలింతలను ఇంటికి సురక్షితంగా చేరుస్తాం. జిల్లాలో దివ్యాంగులు, గర్భిణులు 100 శాతం ఓటుహక్కును వినియోగించుకునే విధంగా కృషి చేస్తున్నాం.  
–జగత్‌కుమార్‌రెడ్డి,జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారి 

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top