సీన్ మారింది! | Everywhere triangular, quadrangular contest | Sakshi
Sakshi News home page

సీన్ మారింది!

Apr 13 2014 11:13 PM | Updated on Mar 18 2019 9:02 PM

గతంలో మారిదిగా కంచుకోటలు లేవు.. సాలిడ్‌గా ఒక్కరికే ఓట్లు పడే పరిస్థితీ లేదు.. కానీ ఎన్నడూ లేనంత పోటీ మాత్రం ఉంది.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  గతంలో మారిదిగా కంచుకోటలు లేవు.. సాలిడ్‌గా ఒక్కరికే ఓట్లు పడే పరిస్థితీ లేదు.. కానీ ఎన్నడూ లేనంత పోటీ మాత్రం ఉంది. ఎవరు ఏ పార్టీ తరఫున బరిలో ఉన్నారన్న విషయం కూడా ఇంకా జనంలోకి పోలే దు. ఈ సారి జంపింగ్‌లు కూడా అధికమే. మొత్తంగా చూసే జిల్లా రాజకీయ చిత్రం అస్పష్టంగా ఉంది. ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఇక అదే స్థాయిలో స్వతంత్రులు కూడా అధిక సంఖ్యలోనే బరిలో ఉన్నారు. ఏ స్థానం చూసుకున్నా పోటీ హోరాహోరీగానే ఉంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు కలిపి 2009లో 219 మంది అభ్యర్థులు పోటీ పడితే ఈ సారి 284 బరిలో నిలిచారు. పార్టీల బలాబలాలు సైతం తారుమారయ్యాయి.

 రాజకీయ విశ్లేషకులకు కూడా ఫలితం ఊహకందడం లేదు.  అయితే ఏ పార్టీ అభ్య ర్థి గట్టెక్కినా నామమాత్రపు మెజార్టీలతోనే. గతంలో జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోరు జరిగేది. 2009 ఎన్నికల్లో బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలు కొన్ని స్థానాల్లో చెప్పుకోదగ్గ ఓట్లను సంపాదించాయి. కొన్ని స్థానాల్లో స్వతంత్రులు బరిలోకి దిగానా వారికి పోలైన ఓట్లు వందల్లోనే. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. గత ఎన్నికలతో ఏ మాత్రం పోల్చుకునే పరిస్థితి. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీల మధ్య చతుర్ముఖ పోటీ ఉంది. కొన్ని స్థానాల్లో తిరుగుబాటుదారులు, స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాతలు మార్చేలా కనిపిస్తున్నారు. మరికొన్ని స్థానాల్లో పొత్తులు పొసగక కత్తులు నూరుకుంటున్నారు. గతంలో ఏక ఛత్రాధిపత్యం ప్రదర్శించిన పార్టీలు చతికిలపడ్డాయి. కొత్తగా తెరమీదకు వచ్చిన పార్టీలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి.

 సెంటిమెంటుదే అగ్రస్థానం
 తెలంగాణలోని మిగిలిన జిల్లాలతో పోల్చితే రంగారెడ్డిలో తెలంగాణ సెంటిమెంటు అంతగా లేనప్పటికీ గ్రామీణ నియోజకవర్గల్లో కాస్త కన్పిస్తోంది. అయితే వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్ స్థానాల్లో ప్రాంతీయాభిమానమే ప్రధానాంశంగా ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ వ్యతి రేకత, ధరల పెరుగుదల, అభివృద్ధి వంటి విషయాలు కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపవచ్చు. ఇక రాజధాని నగ రం, పరిసరాల్లోని నియోజకవర్గాల్లో తెల ంగాణ సెంటిమెంటు ప్రభావం స్వల్పం. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి స్థానాల్లో సెంటిమెంటు ఏ మాత్రం వర్కవుటయ్యే పరిస్థితి లేదు. స్థానికేతర ఓటర్లు అధిక సంఖ్యలో నివసిస్తుండడమే ఇందుకు కారణం. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నంలో కాస్త ప్రభావం చూపొచ్చు.

 ప్రతి ఓటూ విలువైనదే
 శాసనసభ ఎన్నికల్లో నెలకొన్న రసవత్తర పోరు దృష్ట్యా అన్ని పార్టీలూ అందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ఏ ఒక్క విషయంలోనూ ప్రత్యర్థి కంటే తగ్గకూడదన్న ధోరణితో వ్యవహరిస్తున్నాయి. పోటీదారులు అధిక సంఖ్య లో ఉండడంతో ప్రతి ఓటూ విలువైనదేనన్న తరహాలో పార్టీ శ్రేణులకు అభ్యర్థులు దిశానిర్దేశం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement