దోచుకున్నోడే దొర!

దోచుకున్నోడే దొర! - Sakshi


జిల్లాలో కొనసాగుతున్న వరుస దోపిడీలు

యథేచ్ఛగా దోచుకుపోతున్న దొంగలు


 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : నేరశోధనలో మన పోలీసులు పూర్తిగా వెనుకబడి పోయారు. కేసులు నమోదుకే పరిమితమై పోతున్నారు. సంఘటన జరినప్పుడు హడావుడి చేయడం, అనక ఆ సంగతే మరచిపోతుండడంతో దొంగలు పని గట్టుకొని జిల్లాను టార్గెట్ చేస్తున్నారు. తెగబడి లూటీలు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్...గ్రామీణ వికాస బ్యాంకు... కెనరా బ్యాంకు... ఏటీఎంలు  ఇలా ఒక్కోదాన్ని టార్గెట్ చేస్తున్నారు.తాజాగా బుధవారం   బీరంగూడ ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్స్ ఫైనాన్స్‌లో భారీ దోపిడికి పాల్పడడం సంచలనం సృష్టించింది. పట్టపగలు జనం చూస్తుండగానే దొంగలు 3.5 కిలోల నగలు, రూ. లక్ష నగదు పట్టుకొని పోవడంతో సామాన్యులను కలవర పెడుతోంది. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోని రామచంద్రాపురంలోనే దొంగలు ఇలా తెగబడితే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటన్నది సామాన్యుడి ప్రశ్న. పోలీసులు ఇలాగే చోరీలను చూస్తూ కూర్చుంటే దొంగతనాలు ఏ స్థాయిలో జరుగుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జహీరాబాద్‌లో దొంగల జోరుజహీరాబాద్ పట్టణంతో పాటు, నియోజకవర్గం పరిధిలోని బ్యాంకులను, ఏటీఎంలు, ఫైనాన్స్‌లను దొంగలు లక్ష్యంగా చేసుకొని లూటీ చేస్తున్నారు. 2014 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి జహీరాబాద్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగలు పడ్డారు. రూ.13.45 లక్షల నగదు, 7.5 కిలోల బంగారు నగలు దోచుకుపోయారు. ఆరు నెలలు గడిచినా పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న వచ్చిన తర్వాత  ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసులో కొంత ప్రగతి సాధించారు.భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని మాల్దా అనే ప్రాంతంతో నిందితులైన ఖమ్రుద్దీన్, రాజులషేక్‌లను పట్టుకున్నారు. 7.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గ్యాంగ్‌లోని మిగతా వారిని పట్టుకోలేకపోయారు. సెప్టెంబర్ 9న జహీరాబాద్ పట్టణంలోని రఫీ జూయలర్స్ దుకాణంలో దొంగలు చొరబడి అర కిలో బంగారం, 20 కిలోల వెండిని దొంగిలించారు. వీరు కూడా ఇంకా దొరకలేదు.2013 మార్చి 18న కొత్తూర్(బి) గ్రామంలోని సిండికేట్ బ్యాంకులో చోరీకి పాల్పడిన దుండగులు రూ.3.75 లక్షల నగదును దోచుకెళ్లారు. మార్చి 28న కోహీర్ మండలం కవేలిలో గల సిండికేట్ బ్యాంకును దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సందర్భంగా దొంగలు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐ వెంకటేష్ గాయపడ్డాడు.నర్సాపూర్‌లో దొంగలదే పై చేయివెల్దుర్తి మండలంలోని మాసాయిపేటలో ఉన్న కెనరా బ్యాంకు దోపిడి జరిగి 4 నెలలు గడస్తున్నా, ఇప్పటికీ దొంగలు దొరకలేదు. అక్టోబర్ నెల 28న బ్యాంక్ దోపిడి జరిగింది. దొంగలు స్టాంగ్‌రూం గోడకు కన్నం వేసి ప్రత్యేక లాకర్లను ధ్వంసం చేసి 5 కిలోల బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అయితే ఆ బ్యాంకును లూటీ చేసింది ఎవరన్న విషయాన్ని ఇప్పటివరకు అక్కడి పోలీసులు పసిగట్టలేకపోయారు.శివ్వంపేట మండలం గోమారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సంవత్సరం క్రితం చోరీ జరిగింది. దొంగలు ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి లోపలికి చొరబడి లాకర్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పటివరకూ వారిని కూడా పోలీసులు పట్టుకోలేక పోయారు.ఆ రెండు కేసుల్లో సారూప్యం...దోపిడీకి వెళ్తున్న దొంగలు  మొదటగా సీసీ కెమెరాల మీదనే దృష్టి పెడుతున్నారు. కెమెరాలకు హార్డ్ డిస్కును కనెక్ట్ చేసే వైర్లను కత్తిరించిన తర్వాతే చోరీకి పాల్పడుతున్నారు. 2014 నవంబర్ 3న అల్లాదుర్గం పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో దొంగలు చోరీకి యత్నించారు. అప్పుడు జరిగిన దొంగతనానికి తాజాగా రామచంద్రాపురం మండలం బీరంగూడలో జరిగిన లూటీకి కొంత సారూప్యం కనిపిస్తోంది. అల్లాదుర్గం ఎస్‌బీఐలో చోరీ చేసిన దుండగులు కూడా బ్యాంకులోని సీసీ కెమెరాను ఎత్తుక పొయారు.సీసీ కెమెరా మానిటర్‌ను ధ్వంసం చేశారు.  బుధవారం జరిగిన ముత్తూట్ ఫైనాన్స్‌లో లూటీలో కూడా దొంగలు ముందుగా సీసీ కెమెరాలనే లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం గ్యాంగ్‌లోని ఇద్దరిని ప్రత్యేకంగా కేటాయించారు. సీసీ కెమెరాలను హార్డు డిస్కుకు అనుసంధానం చేసే వైర్లను కనిపెట్టి వాటిని కట్ చేయడం,. సైరన్ మోగకుండా మైకు వైర్లను కత్తిరించే పనిని చూసుకున్నారు. తీరా వెళ్లేటప్పుడు హార్డు డిస్కును వెంట తీసుకొని పోయారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా ఇప్పటి మన పోలీసులు ఒక్క దొంగను కూడా పట్టుకోలేక పోతున్నారు.సూపర్ పోలీసింగ్ కోసం ప్రభుత్వం ఆత్యాధునిక వాహనాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినా, చోరీలను నివారింంచలేకపోతున్నారు.  వరుస దొంగతనాలు జిల్లా పోలీసుల ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. గాఢ నిద్రలో జోగుతున్న  మన పోలీసులు ఎప్పుడు మేల్కొంటారో ? దొంగల ఆటలను ఎప్పుడు కట్టడి చేస్తారోఅనేది సగటు మనిషి  మదిని తొలుస్తున్న ప్రశ్న.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top