
లక్ష్మణ్‌తండాలో అలంకారప్రాయంగా ఎత్తిపోతల పథకం
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం సాగునీటి కోసం కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఎత్తిపోతల పథకాలు, కాలువల మరమ్మత్తులు చేపడుతోంది. అయితే, క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో సాగునీటి పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతుడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
రూ.50 లక్షలతో అచ్చన్నపల్లిలో..
టేక్మాల్ మండలం అచ్చన్నపల్లిలో మంజీర నదిపై 1995లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రూ.50 లక్షలతో నిర్మించిన ఈ పథకం ద్వారా అచ్చన్నపల్లి, లక్ష్మణ్, చంద్రుతండాల్లో నాలుగు చెరువులను నింపాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 180 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. రెండేళ్ల పాటు సక్రమంగా పని చేసినా.. నిర్వహణ లోపంతో ప్రస్తుతం వృథాగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.77 లక్షలతో గతేడాది పాత ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా వదిలేసి నూతనంగా నిర్మించారు. ఎత్తిపోతల పథకాన్ని ఓ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఎంత ఆయకట్టు వేయాలో ముందు నిర్ణయించి.. సాగు చేస్తున్నారు. 2017 ఖరీఫ్, 2018 రబీలో సుమారు 100 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగు చేశారు.
అదే అదునుతో ఖరీఫ్‌లో రెట్టింపు సాగు చేయాలని రైతులు గంపెడు ఆశతో భూములన్నీ చదును చేసుకొని.. వరినారు మడులను సిద్ధం చేసుకున్నారు. మరికొందరు రైతులు ముందస్తుగా వరినాట్లు వేశారు. ఎత్తిపోతల ద్వారా రెండు పంటలు నీరు అందకముందే మంజీర ఖాళీ కావడంతో ఆ పథకం కాస్తా నిర్వీర్యం అయ్యింది. ఫలితంగా భూములు బీడులు మారాయి.
మరమ్మతులకు నోచుకోని కోరంపల్లి పథకం
మండలంలోని కోరంపల్లి ఎత్తిపోతల పథకం కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఫలితంగా 600 ఎకరాలకు పైగా బీడుగా మారింది. 1992లో రూ.1.50 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మంజీర తీరంలో అంతర్గత బావి నిర్మించారు. వేసవిలో ఇసుక తరలించడంతో నీరు ఎక్కువగా నిల్వ ఉండని స్థితి ఏర్పడింది. క్రమేపి నీటిమట్టం పడిపోవడంతో సాగు విస్తీర్ణం 150 ఎకరాలకు తగ్గిపోయింది.
ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ద్వారా అసలు వ్యవసాయం చేయడం లేదని రైతులు చెబుతున్నారు. సింగూరు నీటిని మంజీర నదిలోకి వదలకపోవడంతో ఈ పథకం వెలవెలబోతుంది. ఫలితంగా బీడు భూములన్నీ సాగులోనికి వస్తాయనుకున్న రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి.