ఈ-పోలీస్‌ భేష్‌!

EPolice Sevices Available In Police Department In Khammam - Sakshi

ఆధునిక టెక్నాలజీని పోలీసు శాఖ వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంత సేవలు అందిస్తూ..‘స్మార్ట్‌’ పోలీసులుగా మారుతున్నారు. 30 సంవత్సరాల క్రితం ఖాకీ నిక్కర్, తలపైన ఎర్రటోపీ చేతిలో లాఠీ పట్టుకొని కనిపించిన పోలీస్‌ వేరు. ఇప్పుడు..కంప్యూటర్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లు, స్మార్ట్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ కేసుల ఛేదనలతో..ఔరా అనిపించే వేగం వేరు. ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అందుబాటులోకి వచ్చిన, అమలవుతున్న సరికొత్త పోలీసు విధానంతో శాంతిభద్రతల పరిరక్షణకు వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. సరికొత్త మార్పులు..పోలీస్‌ కమిషనర్‌( సీపీ) పర్యవేక్షణలో చోటు చేసుకున్న పరిణామాల సమాహారమే ఈ–పోలీస్‌ అనుసంధాన కథనం.  

క్రైమ్, క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ ( సీసీటీఎన్‌ఎస్‌).. 


దేశ వ్యాప్తంగా ఎక్కడ..ఎవరు, ఏ నేరంచేసినా వాటి వివరాలు, ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్లు అన్నీ సీసీటీఎన్‌ఎస్‌లో అందుబాటులో ఉండనున్నాయి. దీని ద్వారా మొత్తం 18 రకాల నివేదికలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎఫ్‌ఐఆర్, కేసు డైరీ, చార్జిషీట్, కోర్టుతీర్పులు, కోర్టుకొట్టివేత కేసులు, నిందితుల హిస్టరీ షీట్స్‌తో తదితర వివరాలు ఉంటాయి. దీని ద్వారా ఎక్కడ నేరం జరిగినా సంబంధిత ఆరోపణలు, ఎదుర్కొంటున్న నిందితుడి వివరాలు డేటా బేస్‌లో క్షణాల్లో దొరికిపోతాయి. అదే విధంగా ఆర్థిక, సైబర్‌ నేరాలకు సంబంధించిన వివరాలు సైతం డేటా బేస్‌లో నిక్షిప్తం  చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లో అత్యాధునిక కంప్యూటర్ల ద్వారా ఎఫ్‌ఐఆర్‌ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నారు.  

అతి చేస్తే ఆన్‌లైన్‌లోకి ఎక్కుతారు.. 
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ధూమపానం చేస్తే ఇకపై ఊరుకోరు. చిన్నచిన్న గొడవలు, డీజే సౌండ్లతో రచ్చ చేస్తే ఆన్‌లైన్‌లో కేసు నమోదవుతుంది. ఇంకా అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే దుకాణాలు, ఆలస్యంగా మూతపడే బార్లు, రెస్టారెంట్లు, రహదారి, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, నేషేధిత ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, పబ్లిక్‌ న్యూసెన్స్‌లకు పాల్పడే వారిపై ఈ–పెట్టీ కేస్‌ యాప్‌లో కేసులు నమోదు చేస్తారు. భవిష్యత్‌లో మళ్లీ వారు ఏదైనా ఘటనలో పాల్గొన్నప్పుడు ఆన్‌లైన్‌ కేసు వివరాలు ప్రత్యక్షమవుతాయి. తద్వారా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.  ఖమ్మంలో ఇప్పటికే ఈ విధానాన్ని ప్రారంభించి తొలినాళ్లలో పలు కేసులను నమోదు చేశారు. ప్రజలు, విద్యార్థులు, యువకులకు స్మార్ట్‌ పోలీసింగ్‌ విధాన సేవలు అందేల, విస్తృత పరిచేలా అవగాహన కల్పిస్తున్నారు. 

మహిళల భద్రతకు ‘హాక్‌ ఐ’ 
మహిళల భద్రత, నేరాల నియంత్రణకు పోలీసులకు, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఒక యూజర్‌ ఫ్రెండ్లీ మొబైల్‌ యాప్‌గా హాక్‌ ఐ అప్లికేషన్‌ను అందుబాటులోకి వచ్చింది. అత్యవసర  సమయాల్లో సాయం కోసం ఉపయోగించొచ్చు. మహిళలు ప్రయాణం చేస్తుండగా వారికి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే యాప్‌లో ఉన్న ఎస్‌వోఎస్‌ (సేవ్‌ అవర్‌ సోల్స్‌) బటన్‌ నొక్కితే చాలు అత్యవసర సందేశం బాధితురాలి బంధవులకు, స్నేహితులకు , సంబంధిత పోలీస్‌ అధికారులకు, పోలీస్‌ పెట్రోలింగ్‌కు సమాచారం వెళుతుంది. ప్రధానంగా మహిళలు ఒకచోట నుంచి మరోచోటకు క్యాబ్, ఆటోలు, ట్యాక్సీలు, రైలు, బస్సుల్లో ప్రయాణ చేసే ముందు సంబంధిత వాహనం నంబర్‌ కన్పించేలా ఫొటో తీసుకొని అప్‌లోడ్‌ చేయాలి.  

టీఎస్‌ కాప్‌ అప్లికేషన్‌.. 
డీజీపీ మహేందర్‌రెడ్డి జనవరి1న హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక టీఎస్‌కాప్‌ యాప్‌ను ప్రారంభించారు. టీఎస్‌ కాప్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా 54 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. టీఎస్‌ కాప్‌ ద్వారా క్షేత్ర  స్థాయిలో ఉండే సిబ్బంది ఒక్క క్లిక్‌తో తమకు కావాల్సిన సమాచారన్నంతా తెలుసుకోవచ్చు. విచారణకు సంబంధించిన  పూర్తి డాటాబేస్, డయల్‌  100కు అనుసంధానం, పెట్రోలింగ్‌ మొబైల్‌ వాహనాలు, క్రైమ్‌ మ్యాపింగ్, దర్యాప్తునకు కావాల్సిన పూర్తి సమాచారం విచారణ అధికారి చేతిలోనే ఉండడం..తదితర సదుపాయాలెన్నో ఇందులో అందుబాటులో ఉన్నాయి. 

కాప్‌–కనెక్ట్‌.. 


సాంకేతిక అధారిత సేవలతో పోలీస్‌ శాఖను పరుగులు పెట్టిస్తున్న డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి  కాప్‌–కనెక్ట్‌ పేరుతో  తెంగాణ వాట్సాప్‌ను విష్కరించారు. ఇప్పటికే హైడ్‌ కాప్, టీఎస్‌కాప్, హవాక్, ఈ–సెట్టీ యాప్‌ వంటి పలు యాప్‌ ఆధారిత సేవలను శాఖలో అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లో డీజీపీ ఫోన్‌ నెంబర్‌నుంచి కింది స్థాయి వరకు ఉన్న అందరి మొబైల్‌ నెంబర్లకు ఈవాట్సాప్‌ కనెక్ట్‌ అయి ఉంటుంది. ఒకే నెట్‌ వర్క్‌ కిందకు 63వేలమంది ఈయాప్లోకి వస్తారు. శాఖాపరమైన అంతర్గత సమాచారం ఇచ్చి పుచుకోవాలన్నా , చాలా సులభమవుతుంది. సాధారణ వాట్సాప్‌లో 256 నెంబర్లకు మాత్రమే పరిమితం అవుతంది. కానీ ఈ వాట్సాప్‌ లో 63వేలమమందిని చేర్చుకోనే విధంగా తయారు చేశారు. చాటింగ్, గ్రూప్‌ చాటింగ్, ఫొటోలు, టెక్స్‌ట్‌ మెసేజ్‌లు పంపించవచ్చు. ఏదైనా కేసులు, ఘటనల గురించి వేగవంతంగా సమాచార మార్పిడి జరుగుతుంది.  

ఈ–పిటీ కేసుతో  చిన్న నేరాలకు చెక్‌.. 
నేరాల అదుపు, శాంతి భద్రతల పర్యవేక్షణకు ఈ–పెటీ కేసు యాప్‌ సత్ఫాలితాలనిస్తోంది. దళారుల ఆటలు సాగకుండా ఇది తోడ్పడుతోంది. రహదారి, ఫుట్‌పాత్‌ అక్రమణలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, డీజేల వినియోగం లాంటి చిన్న నేరాలకు పాల్పడే వారిని  ఈ–యాప్‌లో కేసు నమోదు చేస్తారు. ఇందుకోసం ఐటీ కోర్‌టీమ్‌  పోలీసులకు శిక్షణ చ్చారు. పట్టణంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల ద్వారానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఏదైనా గొడవలు జరిగినా , ఆక్రమణలు జరిగినా వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు, సంఘటనాస్థలానికి చేరుకుంటారు. నిందితుల వివరాలతో కేసు నమోదు చేసిన వెంటనే కోర్టుకు హాజరయ్యే తేదీని తెలియజేస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను రికార్డుల్లో నిక్షిప్తం చేస్తారు. దీంతో నిందితులు తప్పించుకోనే అవకాశం ఉండదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top