ఇక సభల హోరే..

Elections Candidates Start Campaigning - Sakshi

బరిలో మిగిలినవారు 62

ముగిసిన నామినేషన్ల ఘట్టం 

పటాన్‌చెరులో అత్యధికంగా 16 మంది

అందోలులో ఎనిమిది మంది ..

కొన్ని చోట్ల తప్పుకున్న ఇండిపెండెంట్లు

ప్రచారంపై దృష్టి సారించనున్న అభ్యర్థులు

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలుపుకొని మొత్తం 62 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 16 మంది పోటీ పడుతుండగా, అందోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎనిమిది మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక ఎన్నికలకు కొద్దిరోజులే మిగిలుండడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించనున్నారు.                      

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:   నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీలు ఇక ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించాయి. వీలైనంత మేరకు విస్తృతంగా జనాల్లోకి వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూసుకెళ్తుండగా మిగిలిన పార్టీల్లో ఎలా ముందంజ వేయాలా అన్న సమాలోచనలు జరుపుతున్నారు.

పటాన్‌చెరులో మహా కూటమి తరఫున కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు కొందరు నామినేషన్ల స్క్రూటినీ అనంతరం స్వతంత్రులుగా బరిలో మిగిలిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశించిన సి.అంజిరెడ్డి, కొలన్‌ బాల్‌రెడ్డి, సపాన్‌దేవ్, శశికళ, షేక్‌ అబ్దుల్‌ ఘనీతో పాటు టీడీపీ టికెట్‌ ఆశించిన ఎడ్ల రమేశ్, కరికె సత్యనారాయణ బరి నుంచి తప్పుకున్నారు.

బీజేపీ టికెట్‌ ఆశించిన గాలి వెంకటగిరి కూడా పార్టీ బుజ్జగించడంతో తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకున్నారు. తన అభ్యర్థిత్వం ప్రకటించింది మొదలు శరవేగంతో కదిలిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ అసంతృప్తులను బుజ్జగించడంలో సఫలమయ్యారు. అందోలులో బీఎస్పీ తరపున నామినేషన్‌ వేసిన అల్లారం రత్నయ్య చివరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.

ఇక ప్రచార పర్వంలోకి..!
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ముగియడంతో వివిధ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. నాలుగు ప్రధాన పక్షాలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌పీతో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో మిగిలారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ నెల 28న సంగారెడ్డి జిల్లా పరి«ధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 25న నారాయణఖేడ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల షెడ్యూలు ఖరారు కానప్పటికీ, అభ్యర్తులు తమ నియోజకవర్గాల్లో ప్రచార షెడ్యూలును సిద్ధం చేసుకుంటున్నారు. 

నియోజవకవర్గం    బరిలో ఉన్న అభ్యర్థులు
జహీరాబాద్‌ (ఎస్సీ)    14
పటాన్‌చెరు              16
సంగారెడ్డి                14
అందోలు (ఎస్సీ)       08
నారాయణఖేడ్‌        10
మొత్తం                  62 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top