కోడ్‌ ముగిసింది!

Election Code Is End In Telangana State - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లాలో పది నెలలుగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) శనివారంతో ముగిసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ సర్క్యూలర్‌ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం అందించారు. గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీ, జనవరిలో పంచాయతీ, మార్చిలో ఎమ్మెల్సీ, ఏప్రిల్‌లో లోక్‌సభ, మే నెలలో పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. వరుస ఎన్నికలు ఉండడంతో కోడ్‌ అమల్లో ఉంది. అన్నీ రాష్ట్రాల్లో లోక్‌సభ ఫలితాల తర్వాత కోడ్‌ను ఎత్తివేయగా, మన రాష్ట్రంలో పరిషత్‌ ఫలితాలు లోక్‌సభ ఫలితాల అనంతరం వెలువడడంతో కోడ్‌ కొనసాగుతూ వచ్చింది.

తాజాగా ఫలితాలు వెలువడి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక  కూడా జరిగింది. దీంతో కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే  ఈసారి వరుస ఎన్నికలు రావడంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, వాటికి సంబంధించిన నిధుల విడుదల వెనుకబడిపోయింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, పథకాలతో ప్రజలకు చేకూర్చే లబ్ధి గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిందని చెప్పవచ్చు. 2018 సెప్టెంబర్‌ 6న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు  చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 28న రాష్ట్రంలో పాక్షికంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. సుమారు 251 రోజులు జిల్లాలో కోడ్‌ అమల్లో కొనసాగింది. ప్రస్తుతం కోడ్‌ ముగియడంతో జిల్లాలో పనులకు, నిధుల విడుదలకు లైన్‌క్లియరైంది.

రెండేళ్లుగా అందని రుణాలు... 
గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో  ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటనలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. శనివారం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరగడంతో జిల్లాలో కోడ్‌ పరిసమాప్తమైంది. కోడ్‌ అమలులో ఉండడంతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన వ్యక్తిగత రుణాలు, గ్రూపుల వారీ రుణాల విడుదల రెండేళ్లుగా అందడం లేదు. 2017–18 సంవత్సరంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు రెండేళ్లు దాటిన ఇంత వరకు చెక్కులు గానీ, డబ్బులు గానీ చేతికి అందడం లేదు. ప్రభుత్వఉద్యోగం రాకపోయిన కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో 2017–18 సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా సాయం పొందేందుకు దాదాపు పదివేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంత వరకు సగం మందికి రుణాలు అందలేదు. ఇప్పుడు కోడ్‌ ముగియడంతో లబ్ధిదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

నిలిచిన నిధులు.. పనులు.. 
2018–19 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌ నుంచి మార్చి వరకు ఆరు నెలలుగా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, పనులు గానీ ప్రారంభించకపోగా, 2019–20 ఆర్థిక యేడాదిలోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటివి చేపట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అంటే సుమారు ఎనిమిది నెలలుగా వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు విడుదల నిలిచిపోగా, ఆయా పనులు సైతం ఆగిపోయాయి. ప్రధానంగా వ్యవసాయ శాఖ ద్వారా అందజేసే రైతుబంధు (పెట్టుబడి సాయం) జిల్లాలో ఇంకా రైతులకు అందలేదు.

ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌కు ముందు రైతుల చేతికి అందించాల్సి ఉండగా, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న ఇంత వరకు పెట్టుబడి సాయం చేతికి అందలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కోడ్‌ తొలగిపోవడంతో రైతులకు పెట్టుబడి సాయం అందే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా కళ్యాణలక్ష్మి పథకానికి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకాలకు ఎన్నికల కోడ్‌తో ఏలాంటి సంబంధం లేకపోయినా.. కోడ్‌ అమలులో నేపధ్యంలో పథకాలకు నిధుల విడుదల సమస్యగా మారింది. గత పక్షం రోజుల కిందట నిధులు విడుదలైన అధికారులు ఎన్నికల   పనుల్లో బీజీగా ఉండడంతో లబ్ధిదారుల చేతికి అందలేదు. దీంతో పథకం అమలు మందగించిందని చెప్పొచ్చు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top