అమానుషం: భర్తను ఇంట్లోంచి గెంటేసిన భార్య

Elderly Man Thrown Out Of House By Own Wife In Sircilla - Sakshi

సిరిసిల్లలో అంపశయ్యపై నేతన్న

కొడుకు వద్దకు రానియ్యని అద్దింటి యజమాని

వారంరోజులుగా గుడి వద్ద కూనరిల్లుతున్న వృద్ధుడు

ఆస్పత్రిలో చేర్పించిన సామాజిక కార్యకర్త అశోక్‌

సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో చనిపోతే అరిష్టమని మూఢత్వం పెనవేసుకున్న కార్మికక్షేత్రం సిరిసిల్లలో మరో అమానుషం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య తాళి బంధం కాదనుకుంది. పేగు బంధంతో కొడుకు అక్కున చేర్చుకున్నా.. చచ్చిపోయే వృద్ధున్ని ఇంట్లోకి తీసుకురావద్దని అద్దింటి యజమాని కర్కశత్వం అడ్డుకట్ట వేసింది. ఓ నేతన్న బతికుండగానే శవంలా మారిన ఈ అమానుష సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం గాంధీనగర్‌కు చెందిన కోడం భూమయ్య(65) నేతకార్మికుడు. భార్య బాలలక్ష్మి కొడుకు దేవదాస్, కూతరు జ్యోతిలను పోషించేవాడు. అతడి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కొడుకు, కూతురుకు పెళ్లిల్లు చేశాడు.

బాలలక్ష్మి ఐదేళ్ల క్రితం కొడుకు, కొడలు, వారి పిల్లలతో గొడవపడి వారిని ఇంట్లోంచి వెళ్లగొట్టగా వేరే కాపురం ఉంటున్నారు. ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న దేవదాస్‌ భార్యాపిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం వరకు భూమయ్య ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే బాలలక్ష్మి గొడవపడి ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తాము ఉంటున్న ఇల్లు తన పుట్టింటి వారు ఇచ్చిందని దీనిపై భర్తకు, పిల్లలకు ఏలాంటి హక్కులు లేవని తేల్చిచెప్పి ఒక్కతే ఇంట్లో పిండిగిర్నీ నడిపిస్తూ బతుకుతుంది. భూమయ్య కూడా చేతనైనన్ని రోజులు అక్కడ ఇక్కడా పనిచేస్తూ..కాలం వెళ్లదీసిండు. కొద్ది రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదు. ఈక్రమంలో స్థానిక గాంధీనగర్‌ హనుమాన్‌ ఆలయం వద్ద వారం రోజులుగా ఎండకు ఎండుతూ..వానకు నానుతూ..పడి ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న కొడుకు నాలుగురోజుల క్రితం తానుంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లి సపరిచర్యలు చేస్తుండగా..భూమయ్య చనిపోతే అరిష్టంగా పేర్కొంటూ..ఇంట్లో ఉండొద్దని యజమాని హుకుం జారీచేశాడు. దీంతో దేవదాస్‌ తన తండ్రి బాగోగులు చూడలేకుండా అయ్యాడు. ఈక్రమంలోనే భూమయ్య గుడివద్ద అచేతన స్థితిలో వారం రోజులుగా పడి ఉంటున్నాడు.. 

పరిమళించిన మానవత్వం..

సిరిసిల్ల ధర్మాసుపత్రిలో వైద్యం అందిస్తున్న దృశ్యం.. 

హనుమాన్‌ ఆలయం వద్ద చేతకాకుండా పడిఉన్న భూమయ్యను స్థానిక సామాజిక కార్యకర్త దీకొండ అశోక్‌ మంగళవారం ఆలయ దర్శనానికి వచ్చి గమనించాడు. వెంటనే వివరాలు తెలుసుకున్నాడు. భూమయ్య పరిస్థితిని చూసి జాలేసి స్థానిక జిల్లాసుపత్రిలో చేర్పించగా..సిబ్బంది చికిత్స చేస్తున్నారు. బతికుండగానే భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య, మూఢాచారాలతో అమానవీయంగా ఇంట్లోకి రానివ్వని అద్దె ఇంటి యజమాని నిర్వాకంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top