రూ.128 కోట్లే..

Early Bird Collection Dull in Hyderabad - Sakshi

ఈసారి ‘ఎర్లీబర్డ్‌’ వసూళ్లు డల్‌

ఒకవైపు కరోనా ఎఫెక్ట్‌ కారణం కాగా..  

నివాస భవనాలకు రూ.30వేల లోపు  

ఆస్తిపన్ను వారికే వర్తింపు మరో కారణం  

గత ఏడాది రూ.535 కోట్ల ఆదాయం

విశ్లేషణల్లో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం  

సాక్షి, సిటీబ్యూరో: మూడు నాలుగేళ్లుగా జీహెచ్‌ఎంసీకి ఆర్థిక సంవత్సరం ఆరంభమయ్యే ఏప్రిల్‌లోనే ఆస్తిపన్ను రూపేణా ఎంతో డబ్బు జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరేది. దాంతో ఆ తర్వాత మూడు నాలుగు నెలల వరకు సిబ్బంది జీతభత్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ నెలలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్‌’ పథకం కింద 5 శాతం రాయితీ ఉండటమే ఇందుకు కారణం. రాయితీ ఉండటంతో చాలామంది ఏప్రిల్‌లోనే ఆస్తిపన్ను చెల్లించేవారు.  ఇలా గత ఏడాది ఏప్రిల్‌ నెలలో ఎర్లీబర్డ్‌ ద్వారా దాదాపు రూ. 535 కోట్ల ఆదాయం వచ్చింది.  ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఏప్రిల్‌ నెలాఖరు.. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు  రూ. 128 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందుకు పలు కారణాలున్నట్లు సంబంధిత అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం కారణంగా ఆదాయం లేక, జీతాలు లేక చాలామందికి రోజులు గడవడమే కష్టంగా ఉంది. దీంతో చాలామంది ఆస్తిపన్ను చెల్లించలేదు.

అంతేకాకుండా గత సంవత్సరం వరకు ఎలాంటి వ్యత్యాసాలు లేకుండాజీహెచ్‌ఎంసీ పరిధిలోని నివాస, వాణిజ్య, మిక్స్‌డ్‌ భవనాలన్నింటికీ ఎర్లీబర్డ్‌ కింద 5 శాతం రాయితీ  ఉండేది. దాంతో ఎక్కువ ఆస్తిపన్ను  చెల్లించాల్సిన నివాస భవనాల వారితో పాటు వాణిజ్య భవనాల వారు చెల్లించేవారు. ఈసారి కేవలం నివాస భవనాల వారికి మాత్రమే, అది కూడా రూ. 30వేల లోపు ఆస్తిపన్ను  వరకు మాత్రమే రాయితీ సదుపాయం వర్తింపచేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈసారి వాణిజ్య భవనాలకు రాయితీ లేకపోవడం, నివాస భవనాలకు పరిమితులుండటం కూడా ఆస్తిపన్ను వసూళ్లపై ప్రభావానికి మరో కారణంగా భావిస్తున్నారు. వీటితోపాటు ఈసారి ఎర్లీబర్డ్‌ ద్వారా ఆస్తిపన్ను చెల్లించేందుకు మే నెలాఖరు వరకు అవకాశం ఉంది. గతంతో ఏప్రిల్‌ నెలాఖరు వరకే గడువుండేది. ఇలా వివిధ కారణాలు, కరోనా లాక్‌డౌన్‌తోనూ ఈసారి ఏప్రిల్‌ నెలాఖరు వరకు గతంతో పోలిస్తే తక్కువ ఆదాయం మాత్రమే వచ్చింది. గతంలో వివిధ మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేసేవారు. బిల్‌కలెక్లర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేవారు. ఇవేవీ లేకపోవడం కూడా ఇందుకు కారణాలుగా  అధికారులు విశ్లేషిస్తున్నారు. 

డిమాండ్‌ రూ. 450 కోట్లు..
నివాస, రూ.30వేల లోపు ఆస్తిపన్ను డిమాండ్‌ సైతం దాదాపు రూ. 450 కోట్లు ఉంది.  రూ. 30 వేలలోపు ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు జీహెచ్‌ఎంసీలో దాదాపు 13.70 లక్షల మంది ఉండగా, ఇప్పటి వరకు  2.05 లక్షల మంది మాత్రమే ఎర్లీ బర్డ్‌ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top