డ్రోన్‌ సర్వే! | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ సర్వే!

Published Fri, Jun 29 2018 10:06 AM

Drone survey In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మైనింగ్‌ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనుంది. ఖనిజ వనరుల సర్వేకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించనుంది. ఇప్పటికే కేటాయించిన మైనింగ్‌ ప్రాంతాలను ఈ డ్రోన్‌ సర్వేలో బంధించాలని భావిస్తోంది. ఖనిజ నిక్షేపాలు, నిల్వల సమగ్ర వివరాలను రాబట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. మట్టి, కంకర, ఇతరత్రా మినరల్స్‌ తవ్వకాలకు సంబంధించి వివిధ సంస్థలు, వ్యక్తులకు లీజు ప్రాతిపదికన మైనింగ్‌ శాఖ కట్టబెడుతోంది.

అయితే, ఈ లీజుల వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కేవలం లీజుల కేటాయింపేగాకుండా మైనింగ్‌ విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా లీజుకు కేటాయించిన విస్తీర్ణమేగాకుండా పక్కన ఉన్న భూములను కూడా తవ్వకాలకు వినియోగిస్తున్నట్లు విచారణలో స్పష్టమైంది. దీంతో ప్రభుత్వ రాయల్టీకి గండిపడడమేగాకుండా దొడ్డిదారిన సహజవనరులు తరలిపోతున్నట్లు బహిర్గతమైంది.

146 చోట్ల సర్వే.. 

జిల్లాలో ఖనిజాల తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 24 మండలాల్లో ఈ నిషేధం వర్తిస్తుండగా 146 చోట్ల మాత్రం క్వారీలకు అనుమతులు మంజూరు చేసింది. లీజు ప్రాతిపదికన కంకర, మట్టి, పలుగురాళ్ల, క్వార్ట్‌జ్, కలర్‌ గ్రానైట్‌ సంబంధించి క్వారీలను కేటాయించింది. వీటి కేటాయింపు ద్వారా గతేడాది రూ.61.04 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.90.65(148%)వసూలు చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం రూ.91 కోట్లను లక్ష్యంగా నిర్దేశించగా ఇందులో ఏప్రిల్‌లో రూ.4.58 కోట్లు, మేలో రూ.2.73 కోట్లను సమకూర్చుకుంది. ఖజానాకు ప్రధాన ఆదాయార్జన శాఖల్లో ఒక్కటైన మైనింగ్‌లో జరుగుతున్న అక్రమాలకు ముకుతాడు వేయడం వల్ల మరింత రాబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 
ఈ నేపథ్యంలో మైనింగ్‌ లీజులపై కన్నేసింది.

ఈ క్వారీల్లో ఏ రకమైన ఖనిజాలున్నాయి? నిల్వల సామర్థ్యమెంత? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? తదితర వివరాలను డ్రోన్‌ సర్వేతో తేల్చాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే డీజీపీఎస్‌ సర్వే పూర్తిచేసినందున డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరణ పూర్తిచేసి సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని, తద్వారా అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తోంది.

ఇదిలావుండగా,  జిల్లాలోని 24 మండలాల్లో ఖనిజాల తవ్వకాలపై ఆంక్షలు ఉండడంతో మట్టి, కంకర ధరలు నింగినంటాయి. కేవలం బండరావిరాలలో మాత్రమే మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడంతో సుదూర మండలాల నుంచి వీటిని రవాణా చేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసిమోపడువుతుందని ఇళ్ల నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. 

Advertisement
 
Advertisement