దాబాల్లో మద్యం సిట్టింగులు 

Dabas In Liquor Sittings in Nizamabad - Sakshi

పల్లెల్లో బెల్టు షాపుల జోరు 

విచ్చలవిడిగా విక్రయాలు 

అనుమతులు లేకుండానే నిర్వహణ 

పట్టించుకోని ఎక్సైజ్‌ యంత్రాంగం 

‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు 

మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని దాబా హోటళ్లలో యథేచ్ఛగా సిట్టింగులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం భోజన సదుపాయాలు మాత్రమే కల్పించాల్సిన దాబా హోటళ్లు యథేచ్ఛగా మద్యం సిట్టింగులు చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ అధికారులు మామూలుగా తీసుకోవడంతో వాటి నిర్వహణ ‘మూడు పెగ్గులు–ఆరు గ్లాసులు’గా వర్ధిల్లుతోంది. మద్నూర్‌ మండలంలో ఐదు ధాబా హోటళ్ల ఉండగా, బిచ్కుంద మండలంలో మూడు, జుక్కల్‌ మండలంలో రెండు, పిట్లం మండలంలో నాలుగు హోటళ్లు ఉన్నాయి.

ఇవే కాకుండా గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. నివాస ప్రాంతాల్లోనే ఈ బెల్టు షాపులు ఉండడంతో రాత్రి వేళల్లో మందు బాబులు వేసే వీరంగానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాబా హోటళ్లలో కేవలం భోజన సదుపాయం మాత్రమే ఉండాలి. దీనిపై అధికారుల నియంత్రణ కొరవడింది. ఏదైనా సంఘటన జరిగితే హడావుడి చేసే అధికారులు వీటిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు.

గ్రామాల్లో బెల్టు షాపుల జోరు

ధాబా హోటళ్ల పరిస్థితి ఇలా ఉండగా ప్రతి గ్రామంలో బెల్టు షాపులు ఉన్నాయి. ఒక్క మద్నూర్‌ మండలంలో వందకి వరకు బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. మంచినీళ్లు దొరకని గ్రామాల్లో మద్యం మాత్రం కచ్చితంగా దొరుకుతుంది అనే పరిస్థితి నెలకొందంటే బెల్టు దుకాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటి గురించి ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడంలో మిన్నకుండిపోతున్నారు.

ఇకవైపు గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు పత్రికా ప్రకటనలు ఇస్తున్నా వీటి జోరు మాత్రం తగ్గడం లేదు. దీంతోపాటు మారుమూల గ్రామాల్లో నకిలీ మద్యాన్ని సైతం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అంతే కాకుండా మద్నూర్, జుక్కల్‌ మండలాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడంతో అక్కడి మద్యం, దేశిదారు అక్రమంగా తరలించి విక్రయిస్తున్న పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

యువకులు బానిసలవుతున్నారు 
నేటి ఆధునిక యుగంలో యువకులు, విద్యార్థులు మద్యానికి బానిస అవడం చాలా బాధాకరం. యువత చేతుల్లోనే దేశ భవిశత్తు ఆధారపడి ఉంది. యువకులు మద్యానికి బానిస కా కుండా తమ భవిషత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మద్యం తాగడంతో ఆరోగ్యం పూర్తిగా నాశనం అవుతుందని గుర్తించాలి. మద్యం తో వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.     –ఈరయప్ప, కోడిచిర 

ఫ్యాషన్‌గా మారింది.. 
యువకులకు మద్యం తాగడం ఓ ఫ్యాషన్‌గా మారింది. ఎలాంటి ఫంక్షన్లు, వేడుకలు, కళాశాలలో ఫేర్‌వెల్‌ వంటి పార్టీలలో యువకులు మద్యం సేవిస్తున్నారు. మద్యం తాగి విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. గ్రామాల్లోనూ మద్యం దొరుకుతుంది. అధికారులు చర్యలు తీసుకోవా ల్సిన అవసరం ఉంది. –రమణ, మద్నూర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top