30 ఏళ్ల వరద లెక్కలివ్వండి

CWC Asks AP Telangana To Submit 30 Year Flood Calculations Of Krishna - Sakshi

ఈ నెలాఖరులోగా వివరాలు సమర్పించండి 

సమగ్ర అధ్యయనం చేశాకే ‘మిగులు’తేల్చుదాం 

తెలుగు రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో వరద జలాల లెక్కలను పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేశాకే మిగులు జలాల సంగతి తేల్చాలని కేంద్ర జల సంఘం (సీబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాలు 30 ఏళ్ల వరద లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగానే ఓ నిర్ణయానికి రావచ్చనే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ నెలాఖరులోగా ఇరు రాష్ట్రాలు వరద జలాల డేటా సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఆదేశించాయి. 

మిగులు జలాలపై బుధవారం సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అధికారులు తెలంగాణ, ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్, కృష్ణా బోర్డు తరఫున సాంకేతిక కమిటీ సభ్యకార్యదర్శి హరికేశ్‌మీనా, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు నరసింహారావు, నాగేశ్వరరావు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇరవై నిమిషాల పాటు సాగిన కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున సీఈ నరసింహారావు మాట్లాడుతూ, ఈ ఏడాది ఏపీ తన వాటాకు మించి నీటిని వినియోగించిన అంశాన్ని దృష్టికి తెచ్చారు. వరద జలాలను సైతం ఎక్కువగా వినియోగించిందని, పోతిరెడ్డిపాడు ద్వారా అధికంగా నీటిని వినియోగించారని వెల్లడించారు. 
(చదవండి: తెలంగాణకు తీరని నష్టం)

ఈ దృష్ట్యా వరద జలాలను ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వినియోగించుకోవాలో వాటాలు నిర్ణయించాలని కోరారు. ఏపీ తరఫున సీఈ మాట్లాడుతూ, ఈ నెలాఖరుతో వాటర్‌ ఇయర్‌ ముగుస్తున్నందున ఈ ఏడాది మిగులు జలాల వాటా ఎంత దక్కుతుందో చెప్పాలని కోరారు. అయితే దీనికి సీడబ్ల్యూసీ అభ్యంతరం చెబుతూ, ఇప్పటికిప్పుడు మిగులు జలాల వాటాలు తేల్చడం సాధ్యం కాదని తెలిపింది. మిగులు జలాలపై బ్రజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తేల్చే వరకు, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే శాశ్వత పరిష్కారం కనుగొందామని సూచించింది. జూన్‌ మొదటి వారంలో మరోమారు కాన్ఫరెన్స్‌ నిర్వహిద్దామని తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top