తెలంగాణకు తీరని నష్టం

TS Irrigation Chief Secretary Rajat Kumar Complaint Against AP New Project - Sakshi

నీటి ప్రాజెక్టులపై ఏపీ ముందుకు వెళ్లకుండా నిలువరించండి 

కృష్ణా బోర్డుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ ఫిర్యాదు 

వాటా మేరకు వాడుకుంటేఅభ్యంతరం లేదు.. 

అది తెలుసుకునేందుకు సరైన వ్యవస్థలేదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టదలిచిన ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీరని నష్టం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేటప్పుడు బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం స్పష్టం గా చెబుతోందని పేర్కొన్నారు. అయినా దానికి విరుద్ధంగా ఏపీ నడుచుకుంటోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీలు తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా కొత్తదని, దీనికి ఎలాంటి అనుమతుల్లేవని, బోర్డు తక్షణం జోక్యం చేసుకొని దీన్ని అడ్డుకోవాలని కోరారు. దీంతోపాటు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచడం కూడా తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాలకు విఘాతం కలిగించేదేనని, ఈ దృష్ట్యా ఏపీ తీసుకొచ్చిన జీవో 203పై మరింత ముందుకెళ్లకుండా బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. 
(చదవండి: 30 ఏళ్ల వరద లెక్కలివ్వండి)

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, సీఈలు నరసింహారావు, నర్సింహా.. కృష్ణా బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో బుధవారం జలసౌధలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు పేర్కొంటూ రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఏపీ ప్రాజెక్టులతో జరిగే నష్టాన్ని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరారు. ఈ అంశంపై తమ పరిధిలో ఏపీ నుంచి వివరణ కోరతామని బోర్డు వారికి హామీ ఇచ్చింది. 

అలా అయితే అభ్యంతరం లేదు: రజత్‌
భేటీ అనంతరం రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు జరిగే నష్టంపై బోర్డుకు వివరించామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించినట్లు చెప్పారు. గతంలోనే ఈ అంశంపై ఫిర్యాదు చేశామని, దీనిపై ఏపీ వివరణను బోర్డు కోరిందని, అయితే ఇప్పుడు అధికారికంగా జీవో వచ్చినందున తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. 

3 టీఎంసీలతో చేపట్టే లిఫ్టు పథకం ముమ్మాటికీ కొత్తదేనని, దీనికి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి ఉండాలని చెప్పామన్నారు. ఈ సందర్భంగానే తమ వాటా 512 టీఎంసీల నుంచే నీటిని వినియోగిస్తామని ఏపీ అంటోంది కదా అని ప్రశ్నించగా.. ‘ఏపీ తమ వాటా మేరకు నీటిని వాడుకుంటే అభ్యంతరం లేదు. అయితే అంతే నీటిని వాడుకుంటున్నారన్న దానికి సరైన విధానం లేదు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ పెట్టాలని చెప్పినా అది పూర్తిగా అమల్లోకి రాలేదు. అక్కడి నీటి వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదు. మాటల్లో చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటైతే సమస్యే కదా’అని పేర్కొన్నారు. 

ప్రస్తుతం మధ్యంతర ఒప్పందం మేరకు తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర కేటాయింపులున్నాయని, అయితే పరీవాహకం ఆధారంగా చూస్తే తెలంగాణకు సైతం వాటా పెరగాల్సి ఉందన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్‌ ముందు తాము పోరాడుతున్నట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో భారీ వరదలు వచ్చాయని, అలా వచ్చినప్పుడు సమస్య లేదని, అదే 2017, 2018లో వరద లేక క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలానికి వరద రాకుంటే తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలకు నీరందడం కష్టం అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రాజెక్టులను ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top