నెలాఖరులోగా ఈఓడీబీ సంస్కరణలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) సంస్కరణల లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు.
	ప్రభుత్వ శాఖలకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం
	సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) సంస్కరణల లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. కేంద్ర పరిశ్రమల శాఖ నిర్దేశించిన 372 సంస్కరణల్లో ఇప్పటికే 315 సంస్కరణలను అమల్లోకి తెచ్చామని, మిగిలిన 57 సంస్కరణలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు.
	
	ఈఓడీబీ సంస్కరణల పురోగతిపై శనివారం ఆయన అన్ని శాఖల అధిపతులతో సమీక్ష జరిపారు. 78 సంస్కరణల అమలు తీరుపై కేంద్రం మార్గదర్శకాలను పంపిందని, వీటి ఆధారంగా పరిశ్రమల నుంచి సమాచారం తెప్పించుకుని విశ్లేషించనుందని తెలిపారు. సంస్కరణల ద్వారా అమల్లోకి తెచ్చిన ఆన్‌లైన్ సేవలు, ఇతర సదుపాయాల వినియోగంపై పరిశ్రమలకు సరైన అవగాహన కల్పించాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. రెవెన్యూ, న్యాయ శాఖకు సంబంధించిన సంస్కరణల అమలు క్లిష్టమైన అంశాలని, వీటిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
