కోట్లూ పాయె... ఉన్న ఓట్లు రాకపాయే! | Sakshi
Sakshi News home page

కోట్లూ పాయె... ఉన్న ఓట్లు రాకపాయే!

Published Sun, Jun 7 2015 2:22 AM

కోట్లూ పాయె... ఉన్న ఓట్లు రాకపాయే! - Sakshi

అనుకున్నదొక్కటి... అయ్యినదొక్కటీ.... అని విషాదగీతం పాడుకుం టున్నారు తెలుగు తమ్ముళ్లు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సవాల్ చేసి బలం లేకపోయినా ఎమ్మెల్సీని గెలిపించుకుంటామని బీరాలు పోయిన తెలుగు శిబిరానికి ఏసీబీ రూపంలో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు లంచంగా ఇస్తూ ఎమ్మెల్సీ ఎన్నికకు ఒక్కరోజు ముందు రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆయనతో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలను ‘కొనుగోలు’ చేసి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారంట!. రేవంత్ వ్యవహారం బయటపడ్డా... అడ్వాన్స్‌లు తీసుకున్నోళ్లయినా ఓట్లేస్తారని తెలుగుదేశం నేతలు ఆశించారు.
 
  కానీ కేసీఆర్ రూపం కళ్ల ముందు కనిపించడంతో ‘అడ్వాన్సయిన’ వాళ్లు కూడా ‘కారు గీత’ దాటలేదు. అందరికీ తెలిసి రూ. 50 లక్షలు స్టీఫెన్‌సన్ దగ్గర పోగా... గుట్టుగా మరో రూ. 3కోట్ల వరకు అడ్వాన్స్‌ల రూపంలో తెలుగు శిబిరం లాసయ్యింది. సరే కొనుగోళ్లతో గట్టెక్కకపోయినా... టీడీపీ, బీజేపీకి ఉన్న బలగం 15 మంది ఓట్లేసినా 15 ఓట్లు వస్తే గౌరవం నిలిచేది. కానీ వచ్చిన ఓట్లు తొమ్మిదే. అతి తెలివికి పోయి రెండో ప్రాధాన్యతగా ‘నోటా’కు ఓటేయడంతో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒకవేళ రేవంత్‌రెడ్డి వ్యవహారం బయటపడకపోయినా, కోట్లు లంచాలు ఇచ్చి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో ఓటేయించుకున్నా.... ‘నోటా’కు ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేల పుణ్యాన ఎమ్మెల్సీ మాత్రం గెలిచేవారు కాదు కదా! అని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తెలుగుదేశం నాయకులకు ఎమ్మెల్సీ ఓట్లేయించుకోవడం కూడా తెలియదు పాపం! జనంలో చులకనవడం తప్ప!!

Advertisement
Advertisement