హిప్.. హిప్ హుర్రే | Sakshi
Sakshi News home page

హిప్.. హిప్ హుర్రే

Published Sat, Aug 9 2014 12:17 AM

Convocation celebrations held in hyderabad IIT campus

సంగారెడ్డి డివిజన్: సంగారెడ్డి మండలం కందిలోని ‘ఐఐటీ హైదరాబాద్’ కొత్త క్యాంప్ ఆడిటోరియంలో. సందడి నెలకొంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువ ఐఐటీయన్లు పట్టాలు చేతపట్టుకుని గాల్లోకి టోపీలు విసిరి ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో తృతీయ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐఐటీ డెరైక్టర్ యు.బి.దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హిందూజా గ్రూపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్.శేషసాయి, ఐఐటీహెచ్ పాలకవర్గం అధ్యక్షులు బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి హాజరయ్యారు.

బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎంఫిల్ పూర్తి చేసుకున్న 266 మంది విద్యార్థులు, స్కాలర్స్‌కు ఐఐటీ డెరైక్టర్ దేశాయ్ పట్టాలు అందజేశారు.  శేషసాయి బీటెక్, ఎంటెక్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఐదుగురు విద్యార్థులు బంగారు, పదిహేను మంది విద్యార్థులకు రజత పతకాలను అందజేశారు.   పట్టాలు అందుకున్న విద్యార్థులు సహ చరులు, తల్లిదండ్రులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు టోపీలు ఎగురవేసి హిప్..హిప్ హుర్రే అంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తమ బిడ్డలను తల్లిదండ్రులు అభినందించి హత్తుకున్నారు.

 ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ పూర్తి చేసుకున్న మూడవ బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అలాగే మొదటి సారిగా ఎంఫిల్ పూర్తి చేసుకున్న స్కాలర్స్ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. తృతీయ స్నాతకోత్సవ వేడుకల్లో మొత్తం 266 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. వీరిలో 116 మంది బీటెక్, 106 మంది ఎంటెక్, 34 మంది ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు.

 వీరితోపాటు లిబరల్ ఆర్ట్స్‌లో ఎంఫిల్ పూర్తి చేసిన స్కాలర్స్ ఐదుగురు, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఐదుగురు స్కాలర్స్ పట్టాలు అందుకున్నారు. వీరందరినీ ఐఐటీహెచ్ పాలకవర్గ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, హిందూజా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ శేషసాయి అభినందించారు.  సంగారెడ్డి పట్టణానికి చెందిన సత్యనారాయణ సింగ్, నారాయణఖేడ్‌కు చెందిన సుమన్ జాదవ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన వసుంధరలు పట్టాలు అందుకున్న వారిలో ఉన్నారు.

 బంగారు, రజతపతకాల విజేతలు వీరే...
 ఐఐటీ ప్రామాణిక శ్రేణుల్లో ఉత్తమ ఫలితాలను కనబర్చిన ఎస్.సుదర్శన్ ప్రెసిడెంట్ గోల్డ్‌మెడల్ కైవసం చేసుకోగా అర్చిత్, ప్రియాంకవర్మ, అశ్విన్ అస్సామ్, అమేయ్ ధనుంజయ్‌లు బంగారు పతకాలు పొందారు. బీటెక్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకు ఎస్.సుదర్శన్, ప్రియాంకవర్మలు రజతపతకాలను సైతం కైవసం చేసుకున్నారు. 15 మంది విద్యార్థులు రజతపతకాలు పొందారు.

 ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ పొందిన బెంగుళూరుకు చెందిన ఎస్.సుదర్శన్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ మెడల్ పొందటం ఎంతోఆనందంగా ఉందన్నారు. పట్టుదలగా చదివి తాను ఉత్తమ గ్రేడ్ సాధించినట్లు చెప్పారు. అమెరికా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విధ్యాభ్యాసం చేయటం తన లక్ష్యంగా తెలిపారు. పరిశోధకునిగా తాను ఎదగాలనుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ బోధనాసిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement