మెదక్ జిల్లా బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నర్సింహులు (43) దారుణహత్యకు గురయ్యాడు.
గజ్వేల్ (మెదక్) : మెదక్ జిల్లా బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నర్సింహులు (43) దారుణహత్యకు గురయ్యాడు. సోమవారం గజ్వేల్‌లోని లక్ష్మీప్రసన్న నగర్ కాలనీ ఉన్న తన ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు నర్సింహులును దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చారు. కాగా.. స్థానికులు, తోటి పోలీసులు మాత్రం నర్సింహులును భార్యే హత్య చేసి ఉంటుందని అంటున్నారు. గతంలో చాలాకాలం నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో నర్సింహులుపై భార్య బాలలక్ష్మి మానవ హక్కుల కమీషన్‌లో ఫిర్యాదు కూడా చేసిందని వారు తెలిపారు.
నర్పింహులు, బాలలక్ష్మిలకు నలుగురూ ఆడపిల్లలే ఉండటంతో తాను మరో పెళ్లి చేసుకుంటానని గత కొన్ని రోజులుగా వేధిస్తుండటంతో భార్యే అతన్ని హతమార్చి ఉంటుందని స్థానికులు అంటున్నారు. కాగా.. సోమవారం దుండగుల దాడిలో నర్సింహులు మామకు కూడా కత్తి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.