నియామక బాధ్యత ఎవరి ‘చేతి’కో? 

Congress In Confusion Regarding Local Elections  - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల గడువు సమీపిస్తుండగా కాంగ్రెస్‌ పార్టీలో ఈ ఎన్నికలకు బాధ్యుల నియామక వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. జిల్లాలోని ముఖ్య నేతల మధ్య విభేదాల నేపథ్యంలో ఏకైక ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎవరికి బాధ్యత అప్పగించాలనే వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో జిల్లా ముఖ్యనేతలు మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌ సుజాత, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌పాండేతోపాటు పట్టణ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు. దీంట్లోనే బాధ్యతల అప్పగింత విషయంలో స్పష్టత రానున్నట్లు జిల్లా నేతలు చెబుతున్నారు.

బాధ్యతలు ఎవరికో?
కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌ పాండే తనకు మున్సిపల్‌ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన పక్షంలో స భ్యులకు ఆర్థికంగా సహాయపడడమే కాకుండా గెలుపునకు అన్నివిధాలా కృషి చేస్తానని, అలా కాకుండా ఇతరులకు బాధ్యతలు అప్పగిస్తే తా ను ఎన్నికల వ్యవహారంలో పాల్గొనేది చెబుతున్నారు. ఇటీవల నిర్మల్‌లో జరిగిన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని మున్సిపాలిటీ సన్నాహక సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీని వాసన్‌ కృష్ణన్‌ సమక్షంలో భార్గవ్‌దేశ్‌పాండే ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

మరోపక్క టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌ సుజాత తనకు ఈ బాధ్యతలు అప్పగించాలని కోరారు. మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందనేదీ ఆసకిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల్లో మున్సిపాలి టీకి సంబంధించి ఎన్నికల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. 

పరిషత్‌ ఎఫెక్ట్‌ పడేనా..
జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం జెడ్పీచైర్మన్‌ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు మున్సిపాలి టీ ఎన్నికలకు బాధ్యత అప్పగించే విషయంలో చర్చనీయమవుతోంది. అప్పుడు కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు జెడ్పీటీసీలు గెలువగా, జెడ్పీచైర్మన్‌ ఎన్నిక రోజు ఉట్నూర్‌ కాంగ్రెస్‌ జెడ్పీటీసీ చారులత అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థికి మద్దతు పలికారు. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌పాండే పార్టీ ఇన్‌చార్జీగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ వ్యవహా రంపై కొంతమంది జిల్లా నేతలు టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అప్పుడు పార్టీ జెడ్పీటీసీ సభ్యులకు విప్‌ పత్రంలో సరైన సంతకాలు చేయకపోవడంతో పార్టీ పరంగా ఆ స భ్యురాలిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. టీపీసీసీకి సమాచారం లేకుండానే ఒక సభ్యురాలు అధికార పార్టీకి మద్దతునివ్వడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉందని ఓ కాంగ్రెస్‌ ముఖ్యనేత తెలిపారు. ఒకవేళ పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటే మాత్రం మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతల విషయంలో జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌పాండేకు మొండిచేయి చూపే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం కూడా పా ర్టీలో వ్యక్తమవుతోంది. ముఖ్యనేతలతోపాటు పట్టణ నేతలతో ఈ సమావేశంలో అభిప్రా యం తీసుకొని పార్టీ ఇన్‌చార్జీని శుక్రవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top