కాంగ్రెస్.. జైత్రయాత్ర | Congress 43 seats ZPTC win in Nalgonda | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్.. జైత్రయాత్ర

Jul 6 2014 12:59 AM | Updated on Aug 29 2018 4:16 PM

కాంగ్రెస్.. జైత్రయాత్ర - Sakshi

కాంగ్రెస్.. జైత్రయాత్ర

ఎలాంటి సంచలనాలకు తావు లేకుండానే జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ముగిసింది. జిల్లాలోని 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43 స్థానాలను

 సాక్షిప్రతినిధి, నల్లగొండ :ఎలాంటి సంచలనాలకు తావు లేకుండానే జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ముగిసింది. జిల్లాలోని 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43 స్థానాలను, ఆ పార్టీ మిత్రపక్షం సీపీఐ ఒక స్థానాన్ని వెరసి 44 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. దీంతో జిల్లా పరిషత్‌లో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. కాగా, టీఆర్‌ఎస్ కేవలం 13 స్థానాలకే పరిమితం కావడంతో చైర్మన్ ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే అవకాశమే లేకుండా పోయింది. ఎస్టీలకు రిజర్వు అయిన జెడ్పీకి శనివారం జరిగిన ఎన్నికలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, చందంపేట జెడ్పీటీసీ సభ్యుడు బాలూనాయక్ చైర్మన్‌గా, పెద్దవూర జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి లింగారెడ్డి వైస్‌చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సూర్యాపేట మండాలనికి చెందిన బాషామియా ముస్లిం మైనారిటీల నుంచి, మఠంపల్లికి చెందిన గోపు రాజారెడ్డి క్రిస్టియన్ మైనారిటీల నుంచి కోఆప్షన్ సభ్యులుగా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎలాంటి అనూహ్య పరిణామాలు లేకుండా జెడ్పీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.
 
 అంతా అనుకున్నట్టుగానే..!
 సార్వత్రిక ఎన్నికలకంటే ముందే జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పటికే దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌కు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల పొత్తుల్లో ఒకవేళ దేవరకొండను సీపీఐకి ఇవ్వాల్సి వస్తే, సీటు త్యాగం చేసినందుకు జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామమని హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్‌లోని సీనియర్ అయిన జానారెడ్డి మధ్యవర్తిత్వం చేశారు. చివరకు ఏఐసీసీ నాయకుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్  దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగిందన్నది పార్టీ వర్గాల సమాచారం. దేవరకొండ ఎమ్మెల్యే స్థానాన్ని సీపీఐకి ఇవ్వడం, ఆ పార్టీ గెలవడంతో బాలూనాయక్‌కు చైర్మన్ పదవి ఖాయమని తేలిపోయింది. అయితే, పార్టీ నాయకత్వం అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోవడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఇక, వైస్ చైర్మన్ పదవి సైతం జానారెడ్డి అనుచరుడైన కర్నాటి లింగారెడ్డికి దక్కుతుందని ముందు నుంచే అంతా ఊహించారు.
 
 చైర్మన్ పదవి ఎస్టీకు రిజర్వు అయినందున, వైస్ చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి చెందిన వారికి ఇస్తారని భావించారు. దానికి తగినట్టుగానే జిల్లా కాంగ్రెస్ సీనియర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఏకతాటిపై నిలవడంతో ఈ ఇద్దరూ ఏకగ్రీంగానే ఎన్నికై పదవులు పొందారు. ఇక, కో ఆప్షన్ సభ్యుల పదవుల కోసం నల్లగొండకు చెందిన శౌరయ్య, దేవరకొండకు చెందిన సిరాజ్‌ఖాన్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, వీరు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా  మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యత తీసుకుని పక్కకు తప్పించారు. దీంతో ఇద్దరు కోఆప్షన్ సభ్యులు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. అంతా కాంగ్రెస్ నేతులు ముందే అనుకుని సిద్ధం చేసుకున్న ‘బ్లూ ప్రింట్ ’ ప్రకారమే జెడ్పీని దక్కించుకున్నారు.
 
 అధికార టీఆర్‌ఎస్ భయంతో... ఏకతాటిపైకి
 తమలో తాము గ్రూపులు కడితే, జెడ్పీటీసీ సభ్యులను చీల్చడానికి, జెడ్పీని తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సమాచారంతో, అనివార్యంగా కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్లు విశ్లేషిస్తున్నారు. 13మంది జెడ్పీటీసీ సభ్యులతో రెండోస్థానంలో ఉన్న టీఆర్‌ఎస్ జెడ్పీని దక్కించుకోవడానికి మరో 17మంది సభ్యుల మద్దతు కూడగట్టాల్సి ఉండేది. ఒక వేళ చైర్మన్ పదవి కోసం గ్రూపులుగా విడిపోతే, ఏదో ఒక గ్రూపును దగ్గరకు తీసుకుని తమ ముద్ర వేసేస్తే, భారీ మెజారిటీ ఉండి కూడా జెడ్పీని కోల్పోయిన వారమవుతామన్న ఆందోళన కాంగ్రెస్‌లో ఉంది. జిల్లా నుంచే  సీఎల్పీ నేతగా జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉండడంతో జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఎక్కడా చీలిక రాలేదు. చీలిక వచ్చే సూచనలూ కనిపించకపోవడంతో అటు టీఆర్‌ఎస్ నాయకత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో జిల్లా పరిషత్‌పై కాంగ్రెస్ జెండా మరోసారి రెపరెపలాడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement