
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా రంగంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అంశంపై ఆగస్టు 31న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మంగళవా రం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ...తాజ్ వివంతాలోని ఇంపీరియల్ హాల్‌లో నిర్వహించబోయే సదస్సులో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కవిత, యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బి హడ్డా, బిజినెస్ వరల్డ్ చైర్మన్ అనురాగ్ బాత్రా, ఐఐఎం లక్నో మాజీ డైరెక్టర్ పద్మశ్రీ ప్రీతం సింగ్‌లతోపాటు విద్యావేత్తలు పాల్గొంటారని చెప్పారు.
ఉన్నత విద్యా రంగంలో ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనే అంశంపై సెమినార్ జరుగుతుందని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులపై చర్చించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే పరిశ్రమలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు తెస్తున్నామని, ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశామని చెప్పారు. అన్ని కాలేజీలు, విశ్వ విద్యాలయాలకు వెళ్లి స్టార్టప్‌లపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం సెప్టెంబర్ 15న స్టార్టప్ యాత్రను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.