సంధి కుదిరింది! | compromise between revenue and police department | Sakshi
Sakshi News home page

సంధి కుదిరింది!

Oct 4 2017 10:44 AM | Updated on Oct 8 2018 5:07 PM

compromise between revenue and police department - Sakshi

ఉద్యోగ సంఘాల బాధ్యులతో చర్చిస్తున్న కృష్ణాదిత్య, ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: మహబూబ్‌నగర్‌ ఆర్డీఓ లక్ష్మీనారాయణ, భూత్పూర్‌ తహసీల్దార్‌ జ్యోతి, కొత్తూర్‌ వీర్వో శ్రీనివాస్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయమై మొదలైన ఆందోళన రెవెన్యూ–పోలీసు శాఖల నడుమ సంధి కుదడంతో సమసిపోయింది. ఈనెల 26న అధికారులు, ఉద్యోగులపై భూత్పూర్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ రికార్డుల సర్వే కార్యక్రమాన్ని రెవెన్యూ ఉద్యోగులు బహిష్కరించారు. కాగా, పండుగ సెలవులు రావడం, కలెక్టర్, జేసీ సెలవులో ఉండడంతో కాస్తా సద్దుమణిగిన వివాదం సెలవులు పూర్తి కావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రెవెన్యూ అసోసియేషన్‌ భవనంలో జేఏసీ ఆధ్వర్యాన ఉద్యోగులు సమావేశమై చర్చించారు.

అధికారులతపై కేసులు ఎత్తివేయడంతో పాటు సంబంధిత ఎస్సైని సస్పెండ్‌ చేయాలని, కింది స్థాయి ఉద్యోగులపై కేసు నమోదు చేసే ముందు శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలనే డిమాండ్లను సమావేశం ముందు ఉంచారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయం కొరవడటం కారణంగా ఇలాంటి ఇబ్బందులు రావడం దురదృష్టకరమని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు చెన్నకిష్టప్ప, రామకృష్ణారావు, రామకృష్ణ, బక్క శ్రీనివాస్, రాజగోపాల్, జ్ఞానేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

రోజంతా చర్చలు...
కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో ఎస్పీ అనురాధ, డీఎస్పీ భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు, పోలీసులు, ఆర్డీఓ లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌ జ్యోతి, వీఆర్వో శ్రీనివాస్‌రెడ్డితో ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణాదిత్య మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. సాయంత్రం వరకు జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు, పోలీసులు, కేసులు నమోదైన అధికారులతో విడివిడిగా చర్చించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పాటించేలా ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణాదిత్య పలు సూచనలు చేశారు. అయితే, తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే రెవెన్యూ రికార్డుల సర్వేకు వెళతామని ఉద్యోగులు తేల్చిచెప్పారు.

దీంతో ఎస్పీ అనురాధ మాట్లాడుతూ కేసుపై విచారణ జరిపి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, శాఖాపరంగా కేసులు నమోదు చేసే ముందు సంబందిత ఉన్నతాధికారులకు సమాచారమిచ్చేలా సర్కులర్‌ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. భూత్పూర్‌ ఎస్సై సస్పెండ్‌ విషయమై ఉద్యోగ సంఘాలు పట్టబట్టడంతో ఎటూ తేల్చుకోలేకపోయారు. చర్చల అనంతరం సాయంత్రం ఇన్‌చార్జి కలెక్టర్, ఎమ్మెల్యే, పోలీసు అధికారులు వెళ్లిపోగా ఉద్యోగ సంఘాల నాయకులు రాత్రి 8 గంటల వరకు కలెక్టరేట్‌లోనే నిరీక్షించారు. కాగా, తమ డిమాండ్లపై ఎస్పీ అనురాధ సానుకూలంగా స్పందిస్తూ డీఎస్పీ భాస్కర్‌ ద్వారా సమాచారం ఇచ్చారని వీఆర్వో వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి పొద్దుపోయాక మీడియాకు సమాచారమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement