పిల్లలమర్రి.. డోంట్‌ వర్రీ!

collector Ronald Ross Guarented devoloped pillala marri - Sakshi

పూర్వ వైభవంపై కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ దృష్టి  

చెట్టు చుట్టూ ఫెన్సింగ్‌  ఏర్పాటు  

ప్రారంభమైన ట్రీట్‌మెంట్‌ పనులు  

త్వరలో ఒకే టికెట్‌ విధానం కూడా..  

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లాకు చిహ్నంగా ఉన్న పిల్లలమర్రికి పూర్వవైభవం రానుంది. కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయిస్తున్నారు. వరంగల్‌ ఫారెస్ట్‌శాఖ రీసెర్చ్‌ సైంటిస్టు కిరణ్‌ పర్యవేక్షణలో చెట్టుకు ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తున్నారు. నేలకు తాకిన మర్రిచెట్టు కొమ్మల చుట్టూ గుంతను తవ్వి మట్టిని తీసి కొన్ని రకాల కెమికల్స్‌ను కలిపారు. అలాగే సున్నంలోనూ కెమికల్స్‌ కలిపి మొదళ్ల వద్ద వేశారు. నాలుగు రోజుల నుంచి ఈ ట్రీట్‌మెంట్‌ పనులు కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ స్వయంగా పనులను పరిశీలిస్తున్నారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

నిర్వహణ లేకపోవడమే సమస్య..  
పిల్లలమర్రి చెట్టు నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో గత ఏడాది నుంచి చెట్టు ఎండిపోతోంది. ప్రధానంగా నీటి సమస్య వల్ల వేసవిలో కొమ్మలు ఎండిపోయాయి. కొన్ని కొమ్మలు విరిగిపోతున్నాయి. దీంతో 60శాతం చెట్టు పూర్తిగా పాడైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. 

ఫెన్సింగ్‌ ఏర్పాటు..
ట్రీట్‌మెంట్‌ అనంతరం పిల్లలమర్రిలోని చెట్ల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకులు చెట్టును తాకకుండా, కొమ్మలపై ఎక్కకుండా ఉండేందుకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పర్యాటకులు చెట్టు కింద సేదతీరడానికి పచ్చని గార్డెనింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  

ఇకపై ఒకే టికెట్‌...
ఇక్కడ ఇప్పటివరకు పిల్లలమర్రి, సైన్స్‌ మ్యూజియం, మినీ జూపార్క్, ఆక్వేరియం, ఆర్కియాలజీ మ్యూజియంలకు వేర్వేరుగా టికెట్‌ తీసుకోవాల్సి ఉండేది. పర్యాటకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇకపై అన్నింటికీ ఒకే టికెట్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో దీన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. 

ఇదీ చరిత్ర..  
పిల్లలమర్రికి 750ఏళ్ల చరిత్ర ఉంది. ఏడుతరాలకు సజీవసాక్ష్యంగా నిలుస్తోంది. మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది మహావృక్షంగా మారి నాలుగు ఎకరాలకు విస్తరించింది. రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. దీని నీడన ఏళ్లుగా ఎంతోమంది పర్యాటకులు సేదతీరుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి, పిక్‌నిక్‌ స్పాట్‌గా మారింది. దీంతో ఈ ప్రాంతానికి సాధారణ రోజుల్లో కన్నా సెలవుదినాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. పురావస్తు మ్యూజియం కూడా ఉండడంతో రోజంతా ఇక్కడ ఉల్లాసంగా గడుపుతారు. ఒకేసారి వెయ్యిమంది వరకు సేదతీరే అవకాశం ఉంది. 

                        చెట్టు వద్ద జరుగుతున్న ట్రీట్‌మెంట్‌ పనులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top