24న ‘ఎస్సారెస్పీ’ విడుదలపై సీఎం భేటీ

Cm kcr on SRSC release - Sakshi

ప్రాజెక్టు పరిధిలోని ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయం..

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి పంటలకు నీటి విడుదల విషయమై ఈ నెల 24న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వరంగల్‌ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు సీఎంతో పాటు వచ్చిన మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీ వినోద్‌లు ఎస్సారెస్పీ నుంచి పంటలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన సీఎం.. మంత్రి హరీశ్‌రావుతో ఫోన్‌లో మట్లాడారు. నీటి విడుదల అంశంపై చర్చించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో 24న ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రతినిధులు, అధికారులతో సమావేశమై నీటి విడుదలపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రాజెక్టులో 55.24 టీఎంసీల నీరు..
ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 55.24 టీఎంసీల లభ్యత జలాలున్నాయి. మరో 35.07 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 9.68 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ప్రస్తుత ఖరీఫ్‌లో ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో అడపాదడపా నీటిని విడుదల చేస్తున్నారు. గతేడాది రబీలో ఏకంగా 8.6లక్షల ఎకరాలకు సాగునీరందింది. ప్రస్తుత ఏడాది సైతం రబీ పంటకు నీరందించాలని రైతుల నుంచి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top