అందరికీ ‘అభయం’

Changes in the Abhayahastha scheme - Sakshi

అభయహస్తం పథకంలో మార్పులు

ఎస్‌హెచ్‌జీ సభ్యులతో పాటు భర్తలకూ బీమా

ఇకనుంచి ప్రభుత్వమే చెల్లించనున్న సభ్యుల బీమా వాటా  

ఇప్పటివరకు చెల్లించిన వారికి తిరిగి ఇచ్చే     అవకాశం

ఉమ్మడి జిల్లాలో ఈ పథకం పింఛన్‌దారులు 7,352  

అభయహస్తం సభ్యులు 1,46,451

ఆదిలాబాద్‌: మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లోని సభ్యులకు భరోసా కల్పించే అభయహస్తం పథకం ఇక పూర్తిగా మారనుంది. సభ్యులు, వారి భర్తలకు సైతం బీమా కల్పించేలా పథకంలో మార్పులు చేశారు. దీనికి సీఎం కేసీఆర్‌ సైతం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఏప్రిల్‌ నుంచి కొత్త విధానం అమలులోకి రానున్నట్లు సమాచారం. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందిస్తున్న అభయహస్తం పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సభ్యులు తమ వాటాగా చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోంటోంది. ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగి ఇచ్చేయాలని భావిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బీమా సౌకర్యం, వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2009లో ‘అభయహస్తం’ పథకం ప్రారంభించారు. 18నుంచి 60ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం కింద రూ.500 పింఛన్‌ చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 39,672 ఉండగా, 4,24,380 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 7,352 మంది అభయ హస్తం పింఛన్‌దారులు ఉండగా, 1,46,451 మంది మాత్రమే ఈ పథకంలో చేరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేస్తుండడంతో సంఘాల్లోని మొత్తం సభ్యులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. సభ్యులుగా ఉన్న వారి భర్తలకు కూడా బీమా పథకం వర్తించనుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీమా వర్తించే వారి సంఖ్య 8.50 లక్షలకు చేరనుంది. పథకంలో పూర్తిస్థాయిలో మార్పులు చేయనుండడంతో సభ్యులకు మరింత లాభం చేకూరనుంది.  

బీమా ఉచితమే..
ఈ పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. పథకంలో సభ్యులు బీమా కింద ఏటా రూ. 360, పింఛన్‌దారులు రూ. 356 చెల్లిస్తున్నారు. వీరు చెల్లించిన వాటికి అంతే మొత్తంలో ప్రభు త్వం తన వాటా చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం కొత్త మా ర్పులు చేయడంతో ఈ పథకంలో ఇప్పటి వరకు బీమా సొమ్ము కడుతున్న వారి వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో పాటు ఇప్పటి వరకు సభ్యులు చెల్లించిన బీమా మొత్తాన్ని వారికి తిరిగి ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.   

13 నెలలుగా అందని పింఛన్‌..
60 ఏళ్లు నిండిన వృద్ధులకు అండగా నిలిచేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్‌ ‘ఇందిరా అభయహస్తం’ పథకానికి 2009లో శ్రీకారం చుట్టారు. స్వయం సహాయ సంఘాల్లో సభ్యులై ఉండి, 60 ఏళ్లు నిండిన వృద్దులకు ఈ పథకం వర్తింపజేశారు. గతంలో సామాజిక పింఛన్‌ రూ.200 ఇస్తే.. అదే సమయంలో అభయహస్తం పింఛన్‌ రూ.500 ఇచ్చారు. ఒకప్పుడు నెలనెలా వృద్ధులకు ఆసరాగా నిలిచిన ఈ పింఛన్‌ ప్రస్తుతం పాలకుల తీరుతో పండుటాకులకు భరోసా ఇవ్వలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 7,352 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.500 చొప్పున 2017 జనవరి నుంచి పింఛన్‌ రావాల్సి ఉంది. నాలుగు జిల్లాల పరిధిలోని లబ్ధిదారులకు రూ. 4.77 కోట్లు రావాల్సి ఉంది. పింఛన్‌ డబ్బు అవసరానికి అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top