ఆ‘పరేషాన్‌’ !

Cesarean In Private Hospitals - Sakshi

ప్రైవేట్‌ ఆస్పతుల్లో పెరిగిన సిజేరియన్లు

అవసరం లేకున్నా గర్భిణులకు ఆపరేషన్లు

సర్కారు దవాఖానాలో మెరుగుపడని వసతులు  

కేసీఆర్‌ కిట్‌ అమలుచేస్తున్నా ప్రైవేట్‌ ఆస్పత్రులకే

జిల్లాలో ఒక్కరే అనస్తీషియా వైద్యులు

సాక్షి, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనస్తీషియా వైద్యులు, సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలని, అనవసర ఆపరేషన్లు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2017 నుంచి కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం అమల్లోకి రాకముందు ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవాల కోసం వచ్చేవారి సంఖ్య 22శాతం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 42 నుంచి 45 శాతానికి పెరిగింది. ఎక్కువమంది గర్భిణులను ఆకట్టులేకపోతున్నారని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల గణాంకాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆర్థిక స్థోమత లేకపోయినా పేద గర్భిణులు చాలామంది ప్రభుత్వం ఇస్తున్న రూ.12వేల ప్రోత్సాహకాన్ని వదులుకుని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటున్నారు. 

ఏడాదిలో 9,686 ప్రసవాలు  
జిల్లాలో ఏప్రిల్‌ 2017 మార్చి 2018 వరకు 9,686 ప్రసవాలు జరిగాయి. ఇందులో జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 5,761 ప్రసవాలు జరగ్గా, సాధారణ కాన్పులు 3,641, సిజేరియన్లు 2,120 జరిగాయి. అదే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 3,925 ప్రసవాలు జరగ్గా, సాధారణ కాన్పులు 1,041 మాత్రమే అయ్యాయి. అత్యధికంగా 2,884 సిజేరియన్లుజరిగాయి. ఇంకా ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇలా ఉన్నాయి.  

వైద్యుల కొరతే సమస్య జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు మత్తు మందు ఇచ్చే వైద్యులు ఉండాల్సి ఉండగా, ఒక్కరు మాత్రమే ఉన్నారు.  అతను 8 గంటలు డ్యూటీ చేసి వెళ్లిన తరువాత అత్యవసర కాన్పుల కోసం గర్భిణులు ఎవరైనా వస్తే ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబ్‌నగర్‌కు వెళ్లాలని రెఫర్‌ చేసినా చాలామంది అత్యవసర పరిస్థితుల్లో చేసేదేమీ లేక పలు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధికంగా కాన్పులు జరగాలంటే ముందుగా మత్తుమందు ఇచ్చే వైద్యులను నియమించాలి.   

కోతలే కోతలు
ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఇబ్బందులు పడడం ఎందుకని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లిన గర్భిణులకు సాధారణ కాన్పులకు బదులు సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ కాన్పులు చేస్తే వారికి వచ్చే ఆదాయం తక్కువకావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల గడప తొక్కితేచాలు సిజేరియన్లు కానిచ్చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.25వేల వరకు లాగుతున్నారు. ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టిన తర్వాత కూడా దందా యథావిధిగానే కొనసాగుతోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు.   

సిబ్బంది లేక ఇబ్బందులు
వనపర్తి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ, ఏఓతో పాటు పీడియాట్రిక్‌ ఒకరు, ఐదుగురు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్లు, హెడ్‌నర్సులు ఇద్దరు, నర్సులు 23మంది ఉన్నారు. జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో మరో 28 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది సరిపడా ఉన్నా ముఖ్యమైన గైనకాలజిస్టు వైద్యులు మరో ముగ్గురు అవసరం ఉంది. 

కొరవడిన వసతులు  
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కొరవడ్డాయి. దీంతో చాలామంది ప్రభుత్వ ఆస్పత్రికి రాకపోవడానికి కారణమని తెలుస్తోంది. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆపరేషర్ల ద్వారా  ప్రసవం జరిగిన బాలింతలకు వారం పది రోజుల వరకు నిత్యం డాక్టర్ల పర్యవేక్షణ అవసరం ఉంటుంది. కానీ ప్రతిరోజు ఉదయం పరీక్షించి వెళితే మరుసటి రోజు వరకు డాక్టర్లు అటువైపే కన్నెత్తి చూడడమే లేదు. దీనివల్ల కూడా కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top