బడికి డి‘టెన్షన్‌’..! | Central government of India plan for new education system | Sakshi
Sakshi News home page

బడికి డి‘టెన్షన్‌’..!

Aug 15 2017 2:08 AM | Updated on Nov 9 2018 4:12 PM

బడికి డి‘టెన్షన్‌’..! - Sakshi

బడికి డి‘టెన్షన్‌’..!

పాఠశాల విద్యలో ప్రమాణాలు పెంచే ఉద్దేశంతో 5, 8వ తరగతుల్లో డిటెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

  • 5, 8వ తరగతుల్లో అమలుకు కేంద్రం కసరత్తు
  • ఆ తరగతుల్లో ఉత్తీర్ణులైతేనే పైతరగతులకు..
  • నాణ్యమైన విద్య, బోధనా ప్రమాణాల పెంపు కోసం నిర్ణయం
  • తగిన ఫలితాలు సాధించని టీచర్లపైనా చర్యలు!
  • రాష్ట్రాల్లో అమలుపై ఇంకా రాని స్పష్టత
  • డిటెన్షన్‌ వద్దంటూ గతంలోనే కేంద్రానికి చెప్పిన రాష్ట్రం
  • దానివల్ల డ్రాపౌట్స్‌ పెరుగుతాయంటున్న ఉపాధ్యాయులు
  • పేదలకు చదువు దూరమవుతుందని ఆందోళన
  • కేంద్రం కచ్చితమైన నిర్ణయం ప్రకటించే వరకు గందరగోళమే
  • డిటెన్షన్‌పై ఉపాధ్యాయ సంఘాల భిన్నాభిప్రాయాలు 
  • సాక్షి, హైదరాబాద్‌
    పాఠశాల విద్యలో ప్రమాణాలు పెంచే ఉద్దేశంతో 5, 8వ తరగతుల్లో డిటెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులనే పైతరగతికి పంపించాలని, లేకుంటే మరో ఏడాది అదే తరగతిలో కొనసాగించాలని నిర్ణయించింది.

    ఈ విధానం అమలు కోసం విద్యాహక్కు చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. నాణ్యమైన విద్యను అందించడానికి, బోధనా ప్రమాణాలు పెంచడానికి ఇది తప్పనిసరని భావిస్తోంది. అయితే ఈ డిటెన్షన్‌ విధానం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రధానంగా తెలంగాణ వంటి రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని... ఇప్పటికే 37 శాతంగా ఉన్న డ్రాపౌట్ల రేటు (మధ్యలోనే బడి మానేస్తున్న వారి సంఖ్య) మరింతగా పెరిగే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    తప్పనిసరా.. ఆప్షన్‌ ఉంటుందా..?
    కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్‌ విధానం అమలుపై కసరత్తు ముమ్మరం చేసినా.. ఇంకా పలు అంశాల్లో స్పష్టత ఇవ్వలేదు. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనా? లేక రాష్ట్రాల ఇష్టమా? అన్నది తేలలేదు. వాస్తవానికి తెలంగాణలో నాన్‌ డిటెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేసింది. అప్పట్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో మన రాష్ట్రంతోపాటు పలు ఇతర రాష్ట్రాలకు కూడా నాన్‌ డిటెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని కేంద్రాన్ని కోరాయి. కేంద్రం ఆ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటుందా? డిటెన్షన్‌ విధానం అమల్లో రాష్ట్రాలకు ఆప్షన్‌ ఇస్తుందా.. లేదా? అన్నది తేలాల్సి ఉంది.

    ఇప్పటికే 37 శాతం డ్రాపౌట్స్‌..
    రాష్ట్రంలో మధ్యలోనే బడి మానేస్తున్న విద్యార్థుల సంఖ్య (డ్రాపవుట్స్‌) భారీగా ఉంటోంది. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల్లో పదో తరగతి వచ్చే సరికి 36.99 శాతం మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. ఇది ఎస్సీల్లో 41.14 శాతం, ఎస్టీల్లో 61.33 శాతంగా ఉండడం గమనార్హం. 2006–07 విద్యా సంవత్సరంలో 8,30,606 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరగా... 2015–16లో వారు పదో తరగతికి వచ్చే సరికి 5,23,324 మందే మిగిలారు. మిగతా 36.99 శాతం మంది డ్రాపౌట్‌ అయ్యారు.

    జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్‌ (పాత)లో ఏకంగా 53.26 శాతం మంది తగ్గిపోయారు. ఇక 2006–07లో ఎస్సీ విద్యార్థులు 1,51,709 మంది ఒకటో తరగతిలో చేరితే.. పదో తరగతికి వచ్చే సరికి 89,295 మంది మిగిలారు. ఎస్టీ విద్యార్థులు 1,28,390 మంది చేరితే పదో తరగతికి వచ్చే సరికి 49,644 మందే మిగిలారు. ఇలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్‌ విధానం అమల్లోకి తెస్తే రాష్ట్రంలో డ్రాపౌట్ల రేటు మరింతగా పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

    టీచర్లపైనా చర్యలుంటాయా?
    కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్‌ విధానంతో పాటు విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనను తప్పనిసరి చేయబోతోంది. అది కూడా అమల్లోకి వస్తే... విద్యార్థులెవరైనా కనీస సామర్థ్యాలు సాధించకపోతే సంబంధిత టీచర్లపై చర్యలు చేపట్టే అవకాశం ఉండనుంది. దీంతో డిటెన్షన్‌ విధానం టీచర్లకు కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    సంఘాల భిన్న వాదనలు
    డిటెన్షన్‌ విధానంపై ఉపాధ్యాయ సంఘాల్లోనే భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన విద్య కోసం కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమని కొన్ని సంఘాలు పేర్కొంటుండగా.. దానివల్ల డ్రాపౌట్ల రేటు మరింతగా పెరుగుతుందని మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాల్సిన అవసరముందని, అందుకు డిటెన్షన్‌ విధానం దోహద పడుతుందని పీఆర్టీయూ–టీఎస్‌ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి పేర్కొన్నారు.

    మెరుగైన విద్యను అందించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. అయితే ఇప్పటికే అధిక డ్రాపౌట్‌ శాతం నమోదవుతున్న నేపథ్యంలో.. డిటెన్షన్‌తో మరింత ఎక్కువ మంది బడులకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందని ఎస్టీయూ, యూటీఎఫ్‌ అధ్యక్షులు భుజంగరావు, నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం డిటెన్షన్‌ అమలుకే మొగ్గు చూపినా.. రాష్ట్రంలో మాత్రం అమలు చేయవద్దని కోరారు. 14 ఏళ్లలోపు పిల్లలకు అంతరాయం లేకుండా చదువు అందించాల్సిన ప్రభుత్వాలు.. డిటెన్షన్‌ పేరుతో పేద పిల్లలను బడులకు దూరం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  

    • ఒకటో తరగతిలో చేరి పదో తరగతి వచ్చేసరికి డ్రాపౌట్‌ అవుతున్నవారు    36.99%
    • వీరిలో ఎస్సీ విద్యార్థులు..    41.14%
    • ఎస్టీ విద్యార్థులు    61.33%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement