వామ్మో..  కాసిపేట గని

Casipeta Mine Roof Collapsed For Second Time In Five Days - Sakshi

ఐదు రోజుల్లో రెండోసారి కూలిన పైకప్పు

కార్మికులకు తప్పిన  పెనుప్రమాదం

ఉదయం షిఫ్టులో  సంఘటన

భయాందోళనలో  కార్మికులు

సాక్షి, కాసిపేట(ఆదిలాబాద్‌) : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో మంగళవారం ఉదయం షిప్టులో పైకప్పు కూలింది. ఇలా పైకప్పు కూలడం.. ఐ దురోజుల్లో రెండోసారి. గనిలోని 1వ సీం, 10డీప్, 25 లెవెల్‌లో పనులు నడుస్తున్నాయి. ఎస్‌డీయల్‌ యంత్రంతో ఆపరేటర్‌ బొగ్గు తీసుకొ చ్చేందుకు గనిలోకి వెళ్లాడు. అదే సమయంలో జంక్షన్‌లో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పుషర్‌ కార్మికులు ఇద్దరు అక్కడి నుంచి పరుగెత్తడంతో ప్రాణా లు కాపాడుకున్నట్లయ్యింది. ఎస్‌డీయల్‌ ఆపరేటర్‌ లోనికి వెళ్లకున్నా..  ఇద్దరు కార్మికులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా.. ప్రాణనష్టం సభవించేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. 1 వ సీంలో ప్రమాదపు అంచున పనిచేస్తున్నట్లు కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఐదురోజుల్లో రెండుసార్లు కూలిన పైకప్పు
గనిలో 1సీంలో పనులపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న 1వ సీం 7 డిప్‌ అఫ్‌ 25 లెవెల్‌ జంక్షన్‌లో పెద్దమొత్తంలో పైకప్పు  కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అది జరిగిన ఐదు రోజులకే తిరిగి 10 డిప్‌లో ప్రమాదం జరగడంతో రక్షణ చర్యలు, అధికారులు, యూనియన్‌ నాయకుల తీరుపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7డిప్‌లో కూలినట్లు కూలితే తమ ప్రాణాలు దక్కేవి కావని, తక్కువ పరిమాణంలో కూలడంతో బతికిపోయామని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన ప్రమాదాలను బయటకు రాకుండా సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచడం మినహా రక్షణచర్యలు, కార్మికుల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మొదటిసారి జరిగిన ప్రమాదంపై రెండురోజుల క్రితం గనిని సందర్శించిన ఉన్నతాధికారులు.. 1సీం పనులపై ఆగ్రహం వ్యక్తం చేవారు. అయినా గని అధికారుల్లో స్పందన లేకుండాపోయింది. దీంతో మరోసారి పైకప్పు కూలడం చర్చనీయాంశంగా మారింది.

బొగ్గును టాప్‌కు వదలడమే సమస్య?
గనిలో రూఫ్‌బోల్ట్‌ వేసేక్రమంలో బొగ్గును సైతం టాప్‌కు వదలడమే సమస్య అనే ఆరోపణలున్నాయి. గతంలో రూఫ్‌టాప్‌ బండకు వేసేవారు. దీంతో రూఫ్‌ నుంచి నీరు లీకేజీ అవుతుండడంతో పనిస్థలాల్లో ఎస్‌డీయల్‌ యంత్రాలు నడవడం కష్టమవుతుందని అధికారులు బొగ్గును టాప్‌కు వదిలి రూఫ్‌ వేస్తున్నారు. రూఫ్‌ టచ్‌ కావలంటే 10 ఫీట్లు అవసరం కాగా.. గనిలో కేవలం ఆరుఫీట్లు మాత్రమే ఉండటంతో బోల్టు మధ్యలో ఉంటున్నట్లు కార్మికులు చెబుతున్నారు. దీంతో రూఫ్‌కు బొగ్గుకు మధ్యలో ఉండే క్లే కు నీరు వచ్చి తడిసి పైకప్పు కూలుతున్నట్లు తెలుస్తోంది. జంక్షన్‌లో సక్రమంగా రూఫ్‌బోల్టు వేయడం.. బొగ్గును వదిలి బండకు రూఫ్‌బోల్టు వేస్తెనే కూలకుండా ఉంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి 1సీంలో ఐదుసార్లు పైకప్పు కూలినప్పటికీ అధికారుల చర్యల్లో మాత్రం మార్పు రావడంలేదు. ప్రస్తుతం జరిగే ప్రమాదాలు పెద్దవి అయినప్పటికీ ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయాందోళన మధ్య విధులు నిర్వర్తిస్తున్నామని, ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం తప్పదని, వెంటనె చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top