చాపకింద నీరులా కమలం 

BJP Play Politics In Jayashankar Bhupalpally District - Sakshi

విపక్ష పార్టీలోని అసంతృప్తులే టార్గెట్‌ 

కాంగ్రెస్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నాలు 

సాక్షి, భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికల అనంరతం జరిగిన పరిణామాలతో జిల్లాలో కొంత రాజకీయ అనిశ్చితి నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడం, టీడీపీ కనుమరుగవ్వడం, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోరుమీదున్న బీజేపీకి జిల్లాలో నెలకొన్న రాజకీయ వాతావరణ పరిస్థితులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ మారడంతో కాంగ్రెస్‌  కేడర్‌లో మెజారిటీ నేతలు ఆయన వెంట టీఆర్‌ఎస్‌లో చేరారు. గండ్ర పార్టీ మారిన తర్వాత భూపాలపల్లి కాంగ్రెస్‌లో ఏర్పడిన రాజకీయ శూన్యతను కొండా దంపతులు భర్తీ చేస్తారని భావించారు.

ప్రస్తుతం వారు కూడా కాంగ్రెస్‌ కార్యక్రమాలకు అంటీమట్టనట్లు ఉండడంతో భూపాలపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ కాస్త బలహీనపడిందనే సంకేతాలు వస్తున్నాయి. ఇదే మంచి అవకాశంగా బీజేపీ కేడర్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగానే టీడీపీ జిల్లా అధ్యక్షుడు చాడరఘనాథ్‌ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. సభ్యత్వ నమోదును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూపాలపల్లి నియోజకవర్గంలో 20 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయించామని బీజేపీ చెబుతోంది. వచ్చే మునిసిపల్‌ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. ఇన్నాళ్లు జిల్లాలో కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా ఉన్న రాజకీయాక ముఖ చిత్రాని బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా మర్చాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇతర పార్టీల నేతలను  చేర్చుకోవడం ద్వారా, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో అంతర్మథనం 
ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా  గెలుపు సాధించిన బీజేపీ రాష్ట్రంలో బలపడడానికి ప్రయ త్నాలు చేస్తుండగా, రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ  శ్రేణులను పట్టించుకునే నాయకులు కరువయ్యారు. భరోసా ఇచ్చే నాయకులు లేకపోవడంతో వలసలు పెరిగే అవకాశం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుఫున గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌లో కీలక నేతలు కరువయ్యారు.

ఇక టీడీపీ పరిస్థితి చెప్పా ల్సిన పనిలేకుండా ఉంది. గండ్ర పార్టీ మారిన తర్వాత  మొదట్లో పరిషత్‌ ఎన్నికల ముందు కొండా దంపతులు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు భూపాలపల్లి కాంగ్రెస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కొండా దంపతులు కూడా బీజేపీలోచేరుతున్న ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆదివారం కాంగ్రెస్‌ నేతలు శ్రీధర్‌బాబు, బట్టివిక్రమార్క భూపాలపల్లి పీహెచ్‌సీ సమీక్షించారు. అయితే ఇటువంటి కార్యక్రమాలు గండ్ర పార్టీ మారిన తర్వాత నుంచే ప్రారంభిస్తే బాగుండేదని కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటున్నారు.

మరింత బలపడనున్న బీజేపీ 
భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ మరింత బలపడనుంది. ఇటీవల కాలంలో భూపాలపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 20 వేల మందిని బీజేపీ పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది. కార్యకర్తలతో పాటు నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో కీర్తి రెడ్డి బీజేపీ గెలుపుకోసం పోరాడారు. ప్రస్తుతం చాడ రఘునాథ్‌రెడ్డి కూడా బీజేపీలో చేరడంతో బీజేపీ నియోజకవర్గంలో మరింత బలపడే అవకాశం ఉంది. మునిసిపల్‌ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో గండ్ర, చారి వర్గాల మధ్య ఎమైనా విభేదాలు ఉంటే తమకు ప్లస్‌ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఎవరికైనా టికెట్‌ రాకపోతే బీజేపీ మంచి వేదిక అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top