మెకానిక్‌ల బతుకులు దుర్భరం

Bike Mechanic Facing Many  Problems - Sakshi

వచ్చే ఆదాయంలో సగం షాప్‌ నిర్వహణకే

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వైనం

ప్రభుత్వం చేయూతనివ్వాలని వేడుకోలు

బీబీపేట : ప్రస్తుతం కాలంలో బైకు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పెరుగుతున్న అవసరాల రీత్యా ఒక్కో ఇంట్లో రెండేసి, మూడేసి బైక్‌లు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన యజమాని సర్వీసింగ్, రిపేర్‌ చేయించక తప్పదు.

కానీ బైక్‌ మెకానిక్‌లు పొద్దంతా కష్టపడి పని చేసినా, ఏళ్లు గడిచినా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. నానాటికి పెరిగిపోతున్న వాహనాల విడిభాగాల ధరలతో మెకానిక్‌లకు ఆదాయం తగ్గిపోతోంది. మరమ్మతులు చేస్తే వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు.

దీంతో మెకానిక్‌లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడు కొత్త వాహనాలపై మోజు పెంచుకోవడంతో తమ వృత్తి తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నామమాత్రంగానే చార్జీలు.. 

బైక్‌ సర్వీసింగ్‌కు మెకానిక్‌లు నామమాత్రంగానే చార్జీలు వసూలు చేస్తుంటారు. బైక్‌ సర్వీసింగ్‌ కు రూ. 350లు, వాటర్‌ సర్వీసింగ్‌ కు రూ. 50లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయిల్‌ ధరలు పెరగడం, విడి భాగాల ధరలు పెరగడం వల్ల మిగులుబాటు ఉండడం లేదని మెకానిక్‌లు వాపోతున్నారు. అలాగే నిత్యం ఆయిల్‌ గ్రీజులను ముట్టుకోవడం, వాహనాలను స్టార్ట్‌ చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం వల్ల తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. 

పెరిగిన అద్దెలు 

ప్రస్తుతం మెకానిక్‌ దుకాణం ఏర్పాటు చేయాలంటే పట్టణాలు, మండల కేంద్రాల్లో అయితే రూ. 50వేల అడ్వాన్సుతో పాటు నెలకు కనీసం రూ. 2వేల నుంచి 5వేల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు కరెంట్‌ బిల్లు మరో రూ. వెయ్యి వస్తుంది. మొత్తంగా వచ్చే ఆదాయంలో సగం వరకు ఖర్చులకే సరిపోతుందని మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆరోగ్య పథకాలు, బీమా వర్తింప జేయాలని, అలాగే ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

కుటుంబ పోషణకు కష్టంగా ఉంది 

మెకానిక్‌ పనిచేస్తే వచ్చే ఆదాయం కుటుంబపోషణకు కూడా సరిపోవడం లేదు. అద్దెలు పెరిగాయి. బైకు విడిభాగాలు, పనిముట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదు. మా జీవితానికి ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వం ఆర్థికసహాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలి.

–గుర్రాల నవీన్, బైక్‌ మెకానిక్, బీబీపేట 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top