యాదాద్రికి మరో మణిహారం 'ఎయిమ్స్‌' | Bibinagar AIIMS Is Another Gem To Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికి మరో మణిహారం 'ఎయిమ్స్‌'

Aug 27 2019 9:51 AM | Updated on Aug 27 2019 9:51 AM

Bibinagar AIIMS Is Another Gem To Yadadri - Sakshi

ప్రారంభానికి ముస్తాబైన ఎయిమ్స్‌ 

సాక్షి, యాదాద్రి: ఎంతో కాలంగా రాష్ట్రం ఎదురుచూస్తున్న ఎయిమ్స్‌  (ఆలిండియా మెడికల్‌ సైన్సెన్‌ ఆఫ్‌ ఇండియా) మంగళవారం ప్రారంభం కాబోతుంది. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిమ్స్‌ ఆస్పత్రిని ప్రారంభించిన రోజు చెప్పిన విధంగా ఎయిమ్స్‌ సాకారం కావడం పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో కేంద్రం రూ.1,028కోట్లతో ఎయిమ్స్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బీబీనగర్‌ మండలం రంగాపూర్‌ వద్ద గల నిమ్స్‌ప్రాంగణంలో ఎయిమ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తొలి విడతలో వైద్య విద్య కళాశాలను ప్రారంభిస్తున్నారు. 

50 సీట్లతో వైద్యవిద్య తరగతులు 
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం రంగాపురంలో గల నిమ్స్‌ ప్రాంగణంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా 50 సీట్లతో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తారు. మరో 50 సీట్లతో కలిపి వసతులు సమకూరిన తర్వాత మొత్తం 100సీట్లతో ఎంబీబీఎస్‌ విద్యాబోధన చేయనున్నారు. ఏడాదిన్నర తర్వాత రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులోఉన్న నిమ్స్‌ భవన సముదాయాన్ని ఎయిమ్స్‌ ఉపయోగించుకుంటుంది. నిమ్స్‌ భవనసముదాయంతోపాటు ఎయిమ్స్‌కు ఉచితంగా ఇచ్చిన  221 ఎకరాల స్థలంలో ఎయిమ్స్‌ నిబంధనలకు అనుగుణంగా భవనాలను నిర్మిస్తారు.  

ప్రస్తుతం ఇలా... 
2019–20 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన వైద్యవిద్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో నిర్దేశించిన మేరకు ఇక్కడ చేరుతారు. విద్యార్థులకు వైద్య విద్య అందించడానికి డాక్టర్లతో పాటు సిబ్బందిని నియమించారు. భవిష్యత్‌లో 750 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారు. రోజుకు సుమారు 1,500మంది ఔట్‌ పేషంట్‌లు రావచ్చని అంచనా వేశారు. ఎయిమ్స్‌కు అవసరమైన 221 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో మార్గం సుగమమైంది. ముందుగా 50  ఎంబీబీఎస్‌ విద్యార్థులకు విద్యాబోధన చేయనున్నారు. ఇందుకోసం విద్యార్థులు వచ్చి చేరుతున్నారు.  

భోపాల్‌ ఎయిమ్స్‌ పర్యవేక్షణలో.. 
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ఎయిమ్స్‌ పర్యవేక్షణలో రంగాపూరంలోని నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌ పనిచేయనుంది. ఇందులో 100ఎంబీబీఎస్‌ సీట్లతోపాటు 60 బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.  ఎయిమ్స్‌ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోగులకు 15 నుంచి 20సూపర్‌ స్పెషాలిటీ సేవలు లభిస్తాయి. ఎయిమ్స్‌ పరిధిలో జరిగే వైద్యరంగ పరిశోధనలు, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు నిర్వహిస్తారు. సుశిక్షితులైన వైద్య ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు.  

ఏర్పాట్లు పూర్తి  
నిమ్స్‌ భవనంలోని ఏబ్లాక్‌లో ఎయిమ్స్‌ వైద్య యూనివర్సిటీ మెడికల్‌ కళాశాల తరగుతులు నిర్వహిస్తారు. దీంతో పాటు మరో రెండు బ్లాక్‌లను కేటాయించారు. వీటిలో వీఐపీ లాంజ్, డైరెక్టర్స్‌ చాంబర్స్, కాన్ఫరెన్స్‌ హాల్, వైద్యుల గదుల ఏర్పాటు, రికార్డు రూంలుతో పాటు బ్లాక్‌లోని అన్ని ఫ్లోర్‌లకు అనుకూలంగా ఉండే విధంగా లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. తరగతి  గదుల్లో ఏసీ, ఫ్యాన్లు, లైటింగ్‌ ఏర్పాటు పూర్తయ్యాయి. బాల్కనీలో ఫైర్‌ సేఫ్టీ వర్క్స్, కిచెన్, డైనింగ్‌ హాల్‌ పనులు పూర్తి కావొచ్చాయి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement