breaking news
BIBINagar-NIMS
-
గవర్నర్ తమిళిసైకు మంత్రి హరీష్ కౌంటర్.. పెరిగిన పొలిటికల్ హీట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అధికార టీఆర్ఎస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళిసై తెలంగాణలో వైద్య వ్యవస్థపై కూడా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. వైద్యుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరం. కేసీఆర్ నాయకత్వంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. కేంద్రం పరిధిలో ఉన్న బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి.. కనీస వసతులు కూడా లేవు అని కౌంటర్ ఇచ్చారు. కాగా, అంతకుముందు గవర్నర్ తమిళిసై.. నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ మనోహర్ గుండెపోటుకు గురవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని చాలాసార్లు చెప్పా. కు.ని. శస్త్రచికిత్సలు విఫలమవడం వంటి ఘటనలు చూస్తున్నాం. నిమ్స్ డైరెక్టర్ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలెవరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. పిల్లలను పిల్లులు, ఎలుకలు కరుస్తున్నాయి. కేంద్రం కొత్తగా 8 వైద్య కళాశాలలను మంజూరు చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మవడంతో ఎంసీఐ అనుమతి ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు. -
యాదాద్రికి మరో మణిహారం 'ఎయిమ్స్'
సాక్షి, యాదాద్రి: ఎంతో కాలంగా రాష్ట్రం ఎదురుచూస్తున్న ఎయిమ్స్ (ఆలిండియా మెడికల్ సైన్సెన్ ఆఫ్ ఇండియా) మంగళవారం ప్రారంభం కాబోతుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన రోజు చెప్పిన విధంగా ఎయిమ్స్ సాకారం కావడం పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కేంద్రం రూ.1,028కోట్లతో ఎయిమ్స్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బీబీనగర్ మండలం రంగాపూర్ వద్ద గల నిమ్స్‌ప్రాంగణంలో ఎయిమ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తొలి విడతలో వైద్య విద్య కళాశాలను ప్రారంభిస్తున్నారు. 50 సీట్లతో వైద్యవిద్య తరగతులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురంలో గల నిమ్స్ ప్రాంగణంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా 50 సీట్లతో ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తారు. మరో 50 సీట్లతో కలిపి వసతులు సమకూరిన తర్వాత మొత్తం 100సీట్లతో ఎంబీబీఎస్ విద్యాబోధన చేయనున్నారు. ఏడాదిన్నర తర్వాత రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులోఉన్న నిమ్స్ భవన సముదాయాన్ని ఎయిమ్స్ ఉపయోగించుకుంటుంది. నిమ్స్ భవనసముదాయంతోపాటు ఎయిమ్స్‌కు ఉచితంగా ఇచ్చిన 221 ఎకరాల స్థలంలో ఎయిమ్స్ నిబంధనలకు అనుగుణంగా భవనాలను నిర్మిస్తారు. ప్రస్తుతం ఇలా... 2019–20 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన వైద్యవిద్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో నిర్దేశించిన మేరకు ఇక్కడ చేరుతారు. విద్యార్థులకు వైద్య విద్య అందించడానికి డాక్టర్లతో పాటు సిబ్బందిని నియమించారు. భవిష్యత్‌లో 750 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారు. రోజుకు సుమారు 1,500మంది ఔట్ పేషంట్లు రావచ్చని అంచనా వేశారు. ఎయిమ్స్‌కు అవసరమైన 221 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో మార్గం సుగమమైంది. ముందుగా 50 ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యాబోధన చేయనున్నారు. ఇందుకోసం విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. భోపాల్ ఎయిమ్స్ పర్యవేక్షణలో.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిమ్స్ పర్యవేక్షణలో రంగాపూరంలోని నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ పనిచేయనుంది. ఇందులో 100ఎంబీబీఎస్ సీట్లతోపాటు 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోగులకు 15 నుంచి 20సూపర్ స్పెషాలిటీ సేవలు లభిస్తాయి. ఎయిమ్స్ పరిధిలో జరిగే వైద్యరంగ పరిశోధనలు, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు నిర్వహిస్తారు. సుశిక్షితులైన వైద్య ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఏర్పాట్లు పూర్తి నిమ్స్ భవనంలోని ఏబ్లాక్‌లో ఎయిమ్స్ వైద్య యూనివర్సిటీ మెడికల్ కళాశాల తరగుతులు నిర్వహిస్తారు. దీంతో పాటు మరో రెండు బ్లాక్‌లను కేటాయించారు. వీటిలో వీఐపీ లాంజ్, డైరెక్టర్స్ చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్, వైద్యుల గదుల ఏర్పాటు, రికార్డు రూంలుతో పాటు బ్లాక్‌లోని అన్ని ఫ్లోర్లకు అనుకూలంగా ఉండే విధంగా లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో ఏసీ, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు పూర్తయ్యాయి. బాల్కనీలో ఫైర్ సేఫ్టీ వర్క్స్, కిచెన్, డైనింగ్ హాల్ పనులు పూర్తి కావొచ్చాయి. -
బీబీ నగర్ నిమ్స్ స్థానంలో ఎయిమ్స్: కేసీఆర్
హైదరాబాద్: బీబీ నగర్ పరిధిలోని నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ నెలకొల్పుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. మంగళవారం కేసీఆర్ బీబీ నగర్ నిమ్స్‌ను సందర్శించారు. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన బిల్లు ప్రకారం కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేసిందని కేసీర్ చెప్పారు. బీబీ నగర్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు వందల ఎకరాలకు అదనంగా మరికొంత భూమిని సేకరిస్తానమి కేసీఆర్ తెలిపారు. బీబీ నగర్ ఎయిమ్స్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. బీబీ నగర్ ప్రాంతంలో వినోద, వ్యాపార, విద్యా సంస్థలతో కూడిన అద్భుతమైన టౌన్ షిప్ నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు.