‘భైంసా–హైదరాబాద్‌’ ఎప్పుడో?  

Bhaima-Hyderabad road works should be completed - Sakshi

బాసర, బోధన్‌ మీదుగా జాతీయ రహదారి

రెండేళ్ల క్రితం ప్రకటించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

ఇప్పటికీ ప్రారంభంకాని పనులు

త్వరగా పూర్తి చేయాలంటున్న భక్తులు

భైంసా(ముథోల్‌) ఆదిలాబాద్‌ : చదువుల తల్లి కొలువైన బాసర మీదుగా మరో జాతీయ రహదారి నిర్మాణ హామీ అలాగే మిగిలింది. రెండున్నరేళ్లు గడిచినా నేటికి పనులు జరుగడం లేదు. ఈ రహదారి నిర్మిస్తే బాసర వచ్చే భక్తులకు రాకపోకల ఇబ్బందులు తీరుతాయి. రాష్ట్ర రాజధాని నుంచి మరో మార్గం గుండా బాసరకు చేరుకోవచ్చు. కర్నాటక, మహారాష్ట్రవాసులకు సైతం కొత్తగా నిర్మించే జాతీయ రహదారితో ప్రయాణదూరం తగ్గనుంది.

జనవరి 4, 2016న వరంగల్‌ జిల్లా మడికొండ వద్ద వరంగల్‌–యాదగిరిగుట్ట మధ్య 163వ నంబర్‌ జాతీయ రహదారి విస్తరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌– నర్సాపూర్‌– మెదక్‌– ఎల్లారెడ్డి–బాన్సువాడ– బోధన్‌– బాసర– భైంసా కలుపుతూ 230 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మిస్తామని ప్రకటించారు.  

బాసర మీదుగా ... 

భైంసా నుంచి నిర్మల్‌ వెళ్లి ఏడో నంబర్‌ జాతీయ రహదారి మీదుగా ప్రస్తుతం హైదరాబాద్‌ వెళ్తున్నారు. ఈ మార్గంలో భైంసా నుంచి హైదరాబాద్‌ 262 కిలోమీటర్ల దూరంలో ఉంది. నూతన రహ దారి పూర్తయితే 32కిలోమీటర్ల దూరభారం తగ్గనుంది. భైంసా నుంచి బాసర, బోధన్, బాన్సువా డ, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్‌ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లవచ్చు.

కొత్తగా నిర్మించబోయే రహదా రి పనులు పూర్తయితే కర్ణాటకవాసులు ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా బోధన్‌ నుంచి బాసర చేరుకోవచ్చు. మహారాష్ట్రలోని నాందేడ్, తుల్జాపూర్, కోలాపూర్‌వాసులు సైతం బోధన్‌ మీదుగా నేరుగా బాసర వచ్చే అవకాశం ఉంటుంది.  

తగ్గనున్న దూరభారం

సరస్వతీక్షేత్రంగా పేరొందిన బాసరకు ఇప్పటికే రైలుమార్గం ఉంది. ఈ మార్గం ద్వారానే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. నిజామాబాద్‌ నుంచి బాసర వరకు, భైంసా నుంచి బాసర వరకు ఉన్న రోడ్డు ఇరుకుగా ఉంది. వంపులు తిరిగి గుంతలమయమైన ఈ రోడ్డుపై ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తు తం నిజామాబాద్‌వైపు 20కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ లో ఉన్న ఏకైక ట్రిపుల్‌ఐటీ బాసరలోనే ఉంది. ఇక్కడ ఆరు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొత్తగా నిర్మించే రహదారితో నిజామాబాద్, మెదక్, మహాబూబ్‌నగర్‌ జిల్లావాసులకు దూరభారం తగ్గనుంది.   

ఇరుకు రోడ్డుతో ఇబ్బందులు.. 

భైంసా నుంచి బాసర వరకు ఉన్న 31 కిలోమీటర్ల రహదారి కాస్త ఇరుకుగా ఉంది. ఈ మార్గంలో ముద్గల్, తరోడ గ్రామల వద్ద ఇరుకు వంతెనలు ఉన్నాయి. వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు నూతన వంతెన నిర్మాణం జరుగలేదు. కేంద్రం నిర్మించబోయే రహదారితోనైనా ఈ మార్గంలో ఇరుకువంతెనల ఇబ్బందులు తీరుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

కర్ణాటక వెళ్లేందుకు సౌలభ్యమే... 

ఇప్పుడిప్పుడే వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్న భైంసా పట్టణ మీదుగా నూతనంగా 61వ జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌ నుంచి భైంసా వరకు మరో రహదారిని నిర్మించనున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది.

ఇప్పటికే మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతవాసులకు కొత్తగా నిర్మించే రహదారి నుంచి కర్ణాటకకు రాకపోకలు సులభతరం కానుంది. కర్ణాటకవాసులకు బాన్సువాడ మీదుగా భైంసాకు వచ్చేందుకు సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాద్‌ వెళ్లే అవసరం లేకుండా మధ్య మార్గాల నుంచి బాన్సువాడ, బోధన్, బాసర మీదుగా ఇక్కడకు చేరుకోవచ్చు.  

షిర్డీ వెళ్లేవారికి... 

తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల నుంచి షిర్డీ వెళ్లే యాత్రికులకు కొత్తగా నిర్మించే రహదారి ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌ నుంచి బోధన్‌ చేరుకుని అక్కడి నుంచి నిజామాబాద్‌ వెళ్లే వీలు ఉంటుంది.

అలాగే మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రముఖ గురుద్వార్‌కు సైతం ఈ మార్గం గుండా వెళ్లే అవకాశం ఉంటుంది. కేంద్రం ప్రకటించిన ఈ రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన జరిగేలా చూడాలంటూ ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top