breaking news
Bimsa
-
‘భైంసా–హైదరాబాద్’ ఎప్పుడో?
భైంసా(ముథోల్) ఆదిలాబాద్ : చదువుల తల్లి కొలువైన బాసర మీదుగా మరో జాతీయ రహదారి నిర్మాణ హామీ అలాగే మిగిలింది. రెండున్నరేళ్లు గడిచినా నేటికి పనులు జరుగడం లేదు. ఈ రహదారి నిర్మిస్తే బాసర వచ్చే భక్తులకు రాకపోకల ఇబ్బందులు తీరుతాయి. రాష్ట్ర రాజధాని నుంచి మరో మార్గం గుండా బాసరకు చేరుకోవచ్చు. కర్నాటక, మహారాష్ట్రవాసులకు సైతం కొత్తగా నిర్మించే జాతీయ రహదారితో ప్రయాణదూరం తగ్గనుంది. జనవరి 4, 2016న వరంగల్ జిల్లా మడికొండ వద్ద వరంగల్–యాదగిరిగుట్ట మధ్య 163వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సమక్షంలో కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరి హామీ ఇచ్చారు. హైదరాబాద్– నర్సాపూర్– మెదక్– ఎల్లారెడ్డి–బాన్సువాడ– బోధన్– బాసర– భైంసా కలుపుతూ 230 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మిస్తామని ప్రకటించారు. బాసర మీదుగా ... భైంసా నుంచి నిర్మల్ వెళ్లి ఏడో నంబర్ జాతీయ రహదారి మీదుగా ప్రస్తుతం హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ మార్గంలో భైంసా నుంచి హైదరాబాద్ 262 కిలోమీటర్ల దూరంలో ఉంది. నూతన రహ దారి పూర్తయితే 32కిలోమీటర్ల దూరభారం తగ్గనుంది. భైంసా నుంచి బాసర, బోధన్, బాన్సువా డ, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లవచ్చు. కొత్తగా నిర్మించబోయే రహదా రి పనులు పూర్తయితే కర్ణాటకవాసులు ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా బోధన్ నుంచి బాసర చేరుకోవచ్చు. మహారాష్ట్రలోని నాందేడ్, తుల్జాపూర్, కోలాపూర్వాసులు సైతం బోధన్ మీదుగా నేరుగా బాసర వచ్చే అవకాశం ఉంటుంది. తగ్గనున్న దూరభారం సరస్వతీక్షేత్రంగా పేరొందిన బాసరకు ఇప్పటికే రైలుమార్గం ఉంది. ఈ మార్గం ద్వారానే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. నిజామాబాద్ నుంచి బాసర వరకు, భైంసా నుంచి బాసర వరకు ఉన్న రోడ్డు ఇరుకుగా ఉంది. వంపులు తిరిగి గుంతలమయమైన ఈ రోడ్డుపై ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తు తం నిజామాబాద్‌వైపు 20కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ లో ఉన్న ఏకైక ట్రిపుల్ఐటీ బాసరలోనే ఉంది. ఇక్కడ ఆరు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొత్తగా నిర్మించే రహదారితో నిజామాబాద్, మెదక్, మహాబూబ్‌నగర్ జిల్లావాసులకు దూరభారం తగ్గనుంది. ఇరుకు రోడ్డుతో ఇబ్బందులు.. భైంసా నుంచి బాసర వరకు ఉన్న 31 కిలోమీటర్ల రహదారి కాస్త ఇరుకుగా ఉంది. ఈ మార్గంలో ముద్గల్, తరోడ గ్రామల వద్ద ఇరుకు వంతెనలు ఉన్నాయి. వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు నూతన వంతెన నిర్మాణం జరుగలేదు. కేంద్రం నిర్మించబోయే రహదారితోనైనా ఈ మార్గంలో ఇరుకువంతెనల ఇబ్బందులు తీరుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక వెళ్లేందుకు సౌలభ్యమే... ఇప్పుడిప్పుడే వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్న భైంసా పట్టణ మీదుగా నూతనంగా 61వ జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి భైంసా వరకు మరో రహదారిని నిర్మించనున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతవాసులకు కొత్తగా నిర్మించే రహదారి నుంచి కర్ణాటకకు రాకపోకలు సులభతరం కానుంది. కర్ణాటకవాసులకు బాన్సువాడ మీదుగా భైంసాకు వచ్చేందుకు సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా మధ్య మార్గాల నుంచి బాన్సువాడ, బోధన్, బాసర మీదుగా ఇక్కడకు చేరుకోవచ్చు. షిర్డీ వెళ్లేవారికి... తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి షిర్డీ వెళ్లే యాత్రికులకు కొత్తగా నిర్మించే రహదారి ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి బోధన్ చేరుకుని అక్కడి నుంచి నిజామాబాద్ వెళ్లే వీలు ఉంటుంది. అలాగే మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రముఖ గురుద్వార్‌కు సైతం ఈ మార్గం గుండా వెళ్లే అవకాశం ఉంటుంది. కేంద్రం ప్రకటించిన ఈ రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన జరిగేలా చూడాలంటూ ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
భైంసాలో తల.. నిర్మల్‌లో మొండెం.!
నిర్మల్‌రూరల్/భైంసా : నిర్మల్ జిల్లాలోని భైంసాలో రెండు రోజుల క్రితం గోనెసంచిలో లభ్యమైన తలకు సంబంధించిన మొండెం ఆదివారం జిల్లా కేంద్రంలో లభించడం కలకలం రేపింది. శుక్రవారం ఓ గుర్తు తెలియని యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు కేవలం తలను మాత్రమే గోనెసంచిలో పెట్టి ఓ మురుగు కాలువలో పడేశారు. అయితే ఆ తలను సామాజిక మాధ్యమాలు, మీడియాలో పోలీసులు ప్రచారం చేయడంతో ఆ యువకుడి సోదరుడు గుర్తించి భైంసా పోలీసులను ఆశ్రయించడంతో ఆచూకీ లభించింది. మృతుడు ఉత్తర్‌ప్రదేశ్ వాసి... మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని నాపూర్ తాలుకా, బాయిగూడ గ్రామానికి చెందిన చౌదరి మహ్మద్ ఇస్రార్గా(28)గా గుర్తించినట్లు డీఎస్పీ అందె రాములు, సీఐ జాన్‌దివాకర్ తెలిపారు. ఇస్రార్ 20 రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రానికి బట్టల వ్యాపారం చేయడానికి వచ్చారు. అదే ప్రాంతానికి చెందిన అక్బర్‌తో కలిసి బుధవార్పేట్లోని అఫ్సర్ కిరాణ సముదాయంపైన ఓగదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. అతని భార్య, కూతురు, కుమారుడు ఉత్తరప్రదేశ్‌లోనే నివాసం ఉంటున్నారు. మొండెం లభించింది ఇలా... ఇస్రార్ మొబైల్ రెండు రోజుల నుంచి స్విచ్చాఫ్ రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఉండే అతని సోదరుడు ఖలీద్ ఆందోళన చెంది శనివారం నిర్మల్‌కు వచ్చారు. తన అన్న హత్య జరిగిన విషయం తెలుసుకుని భైంసాలో ఉన్న తలను గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. భైంసా సీఐ శ్రీనివాస్ పట్టణ, రూరల్ సీఐలు జాన్‌దివాకర్, జీవన్‌రెడ్డిలతో కలిసి ఇస్రార్ ఉండే గదికి వెళ్లారు. గదికి వేసిఉన్న తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో ఇస్రార్ మొండెం లభించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోదరుడికి అప్పగించారు. సహచరుడిపైనే అనుమానం... ఇస్రార్ హత్యగావించబడినప్పటినుంచి అతని స్నేహితుడు అక్బర్ అలియాస్ అక్రమ్ కనిపించడం లేదు. దీంతో అతనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని మొబైల్ కూడా స్విచ్చాఫ్‌లో ఉంది. ఇద్దరి మధ్య వ్యాపారంలో జరిగిన విబేధాలే కారణమా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా అక్బర్ కోసం గాలిస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పట్టణ సీఐ జాన్‌దివాకర్ తెలిపారు. -
భైంసాలో అగ్నిప్రమాదం : ఎగసిపడుతున్న మంటలు
భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం పంజేషా చౌక్‌లోని ఫ్యాన్సీ షాపులో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. అ పక్కనే ఉన్న బట్టల దుకాణంలోకి మంటు వ్యాపించాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.