తల్లిదండ్రుల్లో విశ్వాసం నింపలేకపోతున్న ప్రభుత్వం

Bandaru Dattatreya Comments On State Govt - Sakshi

మాజీమంత్రి బండారు దత్తాత్రేయ 

కేంద్ర హోంశాఖ దృష్టికి రాష్ట్ర పరిస్థితులు 

మే 2న తెలంగాణ బంద్‌.. అంతా సహకరించాలి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆత్మ విశ్వాసం నింపడంలో ప్రభుత్వం విఫలమైం దని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అందుకే ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్మీడియెట్‌ ఫలితాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బోర్డు వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థకు టెండర్‌ ఇవ్వడమే దీనికి కారణమని, ఈ వ్యవహారం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. బోర్డు తీరుపై నిరసన తెలిపితే అమానవీయంగా, ఎమర్జెన్సీని తలపించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విచారం వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నిరాహార దీక్షను భగ్నం చేసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బీజేవైఎం కార్యకార్యకర్తల మీద దాడి చేయడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇంటర్మీడియెట్‌ ఫలితాల తప్పులపై సిట్టింగ్‌ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని, వెంటనే ఇంటర్మీడియట్‌ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. బోర్డు వైఫల్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మే 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామని, అందరూ సహకరించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top