నాడు సిపాయి.. నేడు లిఫ్ట్‌బాయ్‌ | Army Employee Working Lift Operator in Hyderabad | Sakshi
Sakshi News home page

నాడు సిపాయి.. నేడు లిఫ్ట్‌బాయ్‌

Oct 3 2019 9:02 AM | Updated on Oct 11 2019 1:02 PM

Army Employee Working Lift Operator in Hyderabad - Sakshi

కస్తూరి సోమయ్య

ఈ చిత్రంలో లిఫ్ట్‌ వద్ద కనిపిస్తున్న వృద్ధుడి పేరు కస్తూరి సోమయ్య. వయసు 71 ఏళ్లు. 1966లో ఆర్మీలో సిపాయిగా చేరి 1973 వరకు దేశానికి సేవలు అందించారు. పాకిస్థాన్‌– బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన యుద్ధంలో భారత్‌ తరపున బెటాలియన్‌ నుంచి పాల్గొన్న ఆయన ఎంతోమంది పాకిస్థానీలను మట్టి కరిపించారు. అప్పట్లో ఆయన జీతం రూ.1000. ఓ రోజు ఫుట్‌బాల్‌ ఆడుతున్న సమయంలో మోకాలికి దెబ్బ తగిలి బోన్‌ చిట్లిపోయింది. దీంతో ఆయన మిలిటరీకి దూరమయ్యారు. చేతిలో చిల్లిగవ్వ లేక మిలిటరీ నుంచి డబ్బులు రాక పొట్టకూటి కోసం ప్రస్తుతం ఓ కాలేజీలో ఇలా లిఫ్ట్‌బాయ్‌గా పనిచేస్తున్నారు సోమయ్య. కాలేజీ యాజమాన్యం ఇచ్చే రూ.4వేల జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. అప్పులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఆ వ్యధార్థ జీవిత యథార్థ గాథ ఇదీ..

సాక్షి, సిటీబ్యూరో:నల్లగొండ జిల్లా కొండగడపకు చెందిన కస్తూరి సోమయ్య 1966లో ఇండియన్‌ ఆర్మీలో సిపాయిగా చేరారు. పదిహేనేళ్ల పాటు సర్వీస్‌ చేయాల్సిన సోమయ్య తెలియని కారణంతో ఏడేళ్లకే 1973లో ఆర్మీ నుంచి వెనుదిరిగారు. ప్రస్తుతం నగరంలోని జిల్లెలగూడలోని లలితానగర్‌లో ఓ అద్దె ఇంట్లో భార్య కౌసల్యతో జీవిస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కుమారుడు అనారోగ్యంతో కొన్నాళ్ల క్రితం మృతిచెందాడు.  

ఆర్మీలో పేరు ప్రఖ్యాతులు..
1966లో సిపాయిగా చేరిన సోమయ్య పాకిస్థాన్‌ బోర్డర్‌ పూంజ్‌ సెక్టార్‌లో 2 ఏళ్ల పాటు సేవలందించారు. ఆ తర్వాత మద్రాస్‌ బెటాలియన్‌కు 1968లో బదిలీ అయ్యారు. సిపాయి మొదలు కమాండర్‌ వరకు 4వేల మంది ఉండే బెటాలియన్‌లో సోమయ్య మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆర్మీ క్యాంప్‌లో ఉండగా కమాండర్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ని నిర్వహించారు. సోమయ్య ‘సి’ కంపెనీకి ప్రాతినిధ్యం వహించారు. ఈ మ్యాచ్‌లో ఎడమ కాలుకు గాయమైంది. మోకాలు వద్ద ఓ బోన్‌ విరగింది. గాయం కారణంగా సోమయ్య ఆరు నెలలపాటు రెస్ట్‌ కావాలని వైద్యులు సూచించారు. తిరిగి నాలుగు నెలలకే మళ్లీ క్యాంప్‌లోకి వెళ్లారు. 

డిశ్చార్జి చేసి పంపేశారు

అప్పటికే కాలికి గాయంతో కష్టాలు పడుతున్న సోమయ్య ఓ రోజు ఎంఆర్‌సీ (తమిళనాడు బోర్డర్‌)లో రన్నింగ్‌ చేస్తుండగా తోటిసైనికులతో సమానంగా పరిగెత్తలేక తీవ్ర నొప్పికి గురై కాస్త వెనకపడ్డారు. ఆ సమయంలో సోమయ్యను గమనించిన కమాండర్‌ విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఎముక విరిగిన సంగతి, ఆరు నెలల రెస్ట్‌ వంటి వివరాలను కమాండర్‌ దృష్టి తెచ్చారు. ఆ తర్వాత కమాండర్‌ సోమయ్యను పిలిచి తెల్లపేపర్‌పై సంతకం పెట్టమన్నాడు. అలా పెట్టనన్న కారణానికి కొద్దిరోజులకే బెటాలియన్‌ నుంచి డిశ్చార్జి చేసి 1973లో సోమయ్యను ఇంటికి పంపించారు.   

ప్రస్తుతం దయనీయం.. 
1973 నుంచి ఇప్పటి వరకు పలు ప్రైవేటు సంస్థల్లో వార్డెన్‌గా, వాచ్‌మన్‌గా చేస్తున్నారు సోమయ్య. ప్రస్తుతం మీర్‌పేటలోని ‘టీకేఆర్‌’ కాలేజీలో లిఫ్ట్‌బాయ్‌గా పని చేస్తున్నారు ఆయన.  రూ.4వేల వేతనంతో సోమయ్య, ఆయన భార్య జీవిస్తున్నారు. ఆర్మీ వైద్యులు అప్పట్లో ఆరు నెలల పాటు రెస్ట్‌ కచ్చితంగా కావాల్సిందేనంటూ రిపోర్టులో రాస్తే ఈ రోజు నెలకు రూ.25వేల పింఛన్‌ అందుకునేవారు. వాళ్లు అలా రాయకపోవడంతో తెల్లపేపపర్‌పై కమాండర్‌ సంతకం పెట్టమంటే పెట్టనన్న కారణంగా అర్ధంతరంగా డిశ్చార్జి చేశారు. ప్రస్తుతానికి నెలకు రూ.4 వేల లోపు పింఛన్‌ వస్తోంది. అది కూడా ఏడాది ఒక్కసారి మాత్రమే ఆర్మీ నుంచి అందుతోంది.   ప్రస్తుతం వైద్య ఖర్చులకూ సైతం సరిపోవడంలేదు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తనను ఆదుకోవాలని ఈ మాజీ సిపాయి వేడుకొంటున్నారు. 

మెడల్స్‌.. సత్కారాలు..
గాయం తర్వాత సోమయ్యను మద్రాస్‌ బెటాలియన్‌ నుంచి చైనా బోర్డర్‌కు పంపారు. జింపుల్‌పూర్, కొచ్చి, నేపాల్‌ వంటి ప్రాంతాల్లో ఆరు నెలల పాటు ఉన్నారు. 1971లో జరిగిన పాకిస్థాన్‌– బంగ్లాదేశ్‌ యుద్ధంలో భారత్‌ తరఫున పాల్గొన్న బెటాలియన్‌లో సోమయ్య ఉన్నారు. ఇదే బెటాలియన్‌లో ఎంతో మంది అసువులు బాశారు. కానీ సోమయ్య తనవంతుగా దేశం తరఫున సేవలు అందించారు. యుద్ధం అనంతరం సోమయ్యకు ‘సంగ్రామం’ మెడల్‌తో ప్రభుత్వం సత్కరించింది. దీంతో పాటు జేఎన్‌కే (జమ్మూకశ్మీర్‌) ఆర్మీ స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమయ్యకు ‘25 యానివర్సిరీ’ మెడల్‌ను ప్రదానం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement