విద్యుత్ సంక్షోభానికి ఏపీప్రభుత్వమే కారణం | AP power crisis due to government | Sakshi
Sakshi News home page

విద్యుత్ సంక్షోభానికి ఏపీప్రభుత్వమే కారణం

Nov 24 2014 2:33 AM | Updated on Sep 18 2018 8:28 PM

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత సీమాంధ్ర పాలకుల స్వార్థపూరిత వైఖరే

 సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత సీమాంధ్ర పాలకుల స్వార్థపూరిత వైఖరే కారణమని విద్యుత్ జేఏసీ నాయకుడు కె.రఘు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సూర్యాపేటలో బాలాజీగార్డెన్స్‌లో నిర్వహించిన రైతాంగ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు ముందున్న పీపీఏను రద్దుచేసి కృష్ణపట్నం ప్లాంట్ నుంచి అలాగే సీలేరు పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ వాటా రానివ్వకుండా అడ్డుకొని కుట్ర పన్నిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
 
 నేడు నీరు, విద్యుత్ ఆంధ్రావారి దోపిడీకి గురై తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిదాపురించిందన్నారు. రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా,గోదావరి నదుల నుంచి 230 టీఎంసీల నీటితో తెలంగాణలోని చెరువులు, కుంటలను నింపుకునే అవకాశం ఉందన్నారు. అలా కాకుండా సీమాంధ్ర పాలకులు తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులను నాశనం చేసి ఆ నీటిని కూడా కిందికి తీసుకొనిపోయారని తెలిపారు. గత పాలకులు ప్రపంచ బ్యాంకు నిధులను కట్టపై మట్టిచల్లి కట్ట ఎత్తు పెంచారే తప్ప పూడిక తీసి నీటిని నింపే ప్రయత్నం చేయలేదన్నారు.
 
 మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునర్నిర్మాణం చేయడం భవిష్యత్‌కు శుభ సూచమన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.మల్లారెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్‌లో విద్యుత్, వర్షం కొరతను దృష్టిలో ఉంచుకొని వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీవీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం అశోక్‌రెడ్డి, అధ్యక్షులు రాయపూడి వెంకటేశ్వరరావు, జి.వెంకటేశ్వర్లు, డాక్టర్ వనజ, చింతలపాటి చినశ్రీరాములు, అంకతి వెంకన్న, సముద్రాల రాంబాబు, మల్లయ్య, గుంటకండ్ల దామోదర్‌రెడ్డి, మారం సంతోష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి,  అంజయ్య, నాగరాజు, బాలాజీ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement